విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం) అమలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గణనీయమైన విజయాన్ని సాధించింది, అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఆరోగ్య సంస్థలలో ఆరోగ్య రికార్డుల డిజిటలైజేషన్ వైపుగా వేగంగా అడుగులు వేస్తోంది. హెల్త్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ ఇంప్లిమెంటేషన్‌లో భాగంగా, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్‌ల రూపకల్పన కోసం ఈ-హాస్పిటల్, నెక్స్ట్ జెన్ ఈ-హాస్పిటల్‌లను ప్రభుత్వం ఉపయోగిస్తోంది. జాతీయ హెల్త్ మిషన్(ఎన్‌హెచ్‌ఎమ్) రాష్ట్ర మిషన్ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఈహెచ్ఆర్ కార్యక్రమాలను గ్రౌండ్ లెవల్‌కు తీసుకెళ్లేందుకు ఏబీడీఎం బృందం ఎన్ఐసీ బృందంతో సమన్వయం చేసుకుని డిస్ట్రిక్ట్ మాస్టర్స్ ట్రైనింగ్ (ToT) కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ నెల 15, 16 తేదీలలో హాయ్‌లాండ్ థీమ్ పార్క్‌లో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన డైరెక్టర్ ఆఫ్ సెకండరీ సర్వీసులు(డీఎస్‌హెచ్)కు చెందిన మెడికల్ ఆఫీసర్లు, నర్సులు, ఫార్మసిస్ట్‌లు, ల్యాబ్‌టెక్నీషియన్‌లకు ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఏబీడీఎం రాష్ట్ర నోడల్ అధికారి బి.వి.రావు ప్రారంభ ఉపన్యాసం ఇచ్చి, ఏబీడీఎం గురించి స్థూలంగా వివరించగా, తరువాత పీ.ఓ డా. నరేష్, ఇతర ఎన్ఐసీ రోల్ అవుట్ మేనేజర్‌లు సెషన్‌లను నిర్వహించారు. ఎన్‌హెచ్‌ఎం స్టేట్ ప్రోగ్రాం మేనేజర్ డా. దుంపల వెంకట రవికిరణ్, అలాగే సెకండరీ హెల్త్ ఏబీడీఎం నోడల్ అధికారి నాగలక్ష్మి, ఏబీడీఎం ప్రాజెక్టు కోఆర్డినేటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులను సమర్థవంతంగా అమలు చేయడం కోసం గ్రౌండ్ లెవల్ హెల్త్ కార్యకర్తలందరికీ శిక్షణను అందించేందుకు ఈ ట్రైనింగ్ సెషన్‌ను రేపు కొనసాగించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా మాస్టర్ ట్రైనర్లు తమ జిల్లాల్లో శిక్షణ ఇస్తారు.