– జిల్లా జాయింట్ కలెక్టర్, మైలవరం ఆర్‌వో పి.సంపత్ కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదలతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుందని.. ఈ నేపథ్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ (ఎఫ్ఎస్‌టీ), స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ (ఎస్ఎస్‌టీ), వీడియో సర్వైలెన్స్ టీమ్స్ (వీఎస్‌టీ) తదితరాలు మరింత క్రియాశీలంగా, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్ సూచించారు.
జిల్లా జాయింట్ కలెక్టర్, మైలవరం రిటర్నింగ్ అధికారి పి.సంపత్ కుమార్ సోమవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన అనంతరం డా. లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎఫ్ఎస్‌టీ, ఎస్ఎస్‌టీ, వీఎస్‌టీ, వీవీటీ, ఏఈవో, సెక్టార్ ఆఫీసర్స్, పోలీస్ సెక్టార్ ఆఫీసర్స్‌తో సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు నియోజకవర్గం స్థాయిలో బృందాల పనితీరును సమీక్షించారు. ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షిక వాతావరణంలో నిర్వహించడంలో భాగంగా ఎలక్షన్ సీజర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఈఎస్ఎంఎస్)ను నియోజకవర్గంలో పటిష్ట అమలుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సీజర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రత్యేక యాప్‌లో వివరాలను సక్రమంగా నమోదు చేయాలన్నారు. నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల వ్యయ వివరాలను నమోదు చేయాలన్నారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పనిచేయాలన్నారు. ఎన్నికల విధుల నిర్వహణలో అలసత్వం వహిస్తే ఎన్నికల నియమావళి మేరకు చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరగనున్న నేపథ్యంలో ప్రక్రియ సజావుగా సాగేందుకు సన్నద్ధంగా ఉండాలని చెబుతూ పలు సూచనలు చేశారు. నియోజకవర్గలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు తీరుపైనా సమీక్షించి.. ఇకపైనా అనుసరించాల్సిన విధానాలపై జాయింట్ కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏసీపీ రమేష్, ఏఆర్‌వోలు, ఎంపీడీవోలు, ఎంసీసీ బృందాల అధికారులు, సెక్టార్లు ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.