విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తప్పుడు వార్త లేదా తప్పుదారి పట్టించే సమాచారాల విషయంలో సమష్టిగా ప్రతిస్పందించాలని, ప్రజల్లోకి వాస్తవాలు తీసుకెళ్లాలని ఐఎంపీసీసీ (ఇంటర్ మీడియా పబ్లిసిటీ కోర్డినేషన్ కమిటీ) తొలి సమావేశంలో నిర్ణయించారు. విజయవాడలోని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కాంప్లెక్స్‌లో ఈ రోజు ఐఎంపీసీసీ మొదటి సమావేశం జరిగింది. రైల్వే, తపాలా, ఆదాయ పన్ను, కేవీఐసీ, విమానాశ్రయ అథారిటీ, మంగళగిరి ఎయిమ్స్, ఎన్‌వైకేఎస్, ఎన్‌ఎస్‌ఎస్‌వో, దూరదర్శన్, ఆకాశవాణి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార & ప్రజా సంబంధాల విభాగం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (లీడ్ బ్యాంక్), భారత ఆహార సంస్థ, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ సహా కీలక ప్రభుత్వ విభాగాలు, సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఏదైనా తప్పుడు వార్త లేదా తప్పుదారి పట్టించే సమాచారం సమాజంలో వ్యాప్తి చెందితే, ప్రజలకు వాస్తవాలు వివరిస్తూ ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని, ఇందుకోసం అన్ని విభాగాలు/శాఖలు తగిన వ్యూహరచన & సమన్వయం చేసుకోవాలన్న ప్రాథమిక ఎజెండాతో ఈ సమావేశం సాగింది. స్వీప్ (సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్) కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని కూడా చర్చించారు.
పీఐబీ విజయవాడ ఏడీజీ రాజిందర్ చౌదరి అధ్యక్షతన ఐఎంపీసీసీ తొలి భేటీ జరిగింది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి సమర్ధవంతంగా తీసుకెళ్లాల్సిన అవసరాన్ని రాజిందర్ చౌదరి నొక్కిచెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వ విభాగాలు, పీఎస్‌యూలు, మీడియా విభాగాల మధ్య సమగ్ర సమన్వయం, సమాచార మార్పిడి పెంచడమే ఈ సమావేశం ఉద్దేశమని ఆయన తెలిపారు. భారత ప్రభుత్వ నోడల్ ఏజెన్సీగా ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు, చొరవలు, విజయాల సమాచారాన్ని ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియాకు అందించే పాత్రను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) నిర్వర్తిస్తోందని వివరించారు. ప్రభుత్వానికి-మీడియాకు మధ్య సంధానకర్తగా పీఐబీ వ్యవహరిస్తుందని; మీడియాలో ప్రతిబింబించే ప్రజావాక్కును ప్రభుత్వానికి అందించడానికి కూడా పని చేస్తుందని అన్నారు.
తప్పుదారి పట్టించే సమాచారం లేదా తప్పుడు వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పీఐబీ వాస్తవ తనిఖీ విభాగాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని ఐఎంపీసీసీ సభ్యులు నిర్ణయించారు.
ఒక వార్తలో నిజానిజాలను వాట్సప్ నంబర్ 91-8799711259 లేదా పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ద్వారా నిర్ధరించుకోవచ్చని, లేదా factcheck@pib.gov.inకు ఇ-మెయిల్ పంపవచ్చని పీఐబీ డైరెక్టర్ జి.డి.హల్లికేరి సూచించారు.
ప్రదర్శనలు, నాటకాలు, జానపద పాటల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సమాచార వ్యాప్తికి సీబీసీ నిర్వహిస్తున్న కార్యకలాపాల గురించి సిబిసి డైరెక్టర్ పి.రత్నాకర్ వివరించారు.
వివిధ కార్యాలయాలు, సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో మాట్లాడారు. తమ కార్యాలయాలు, సంస్థల్లో జరుగుతున్న అన్ని ఉత్పాదక కార్యక్రమాలు పీఐబీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.