-మూడు అంశాలపై ఫిర్యాదులను అందించిన వైసీపీ బృందం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కించపరుస్తూ తెలుగుదేశం నేత నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని వైసీపీ బృందం కోరింది. ఈ మేరకు అడిషనల్ సీఈవో కోటేశ్వరరావుకు బుధవారం ఆధారాలతో ఫిర్యాదునందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నానాటికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక కూటమి కుట్రలు పన్నుతోందని మల్లాది విష్ణు ఆరోపించారు. ముఖ్యంగా కొందరు నేతలు సీఎం జగన్ పై అక్కసు వెళ్లగక్కుతూ బహిరంగ సభలలో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈనెల 16 న కర్నూలు సభలో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరమన్నారు. ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంభోదించడం., జనకంత్రి, ముదరష్ఠ వాలకం అంటూ వ్యక్తిగత ధూషణలు చేయడం తీవ్ర అభ్యంతరకరమన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి విరుద్ధమని.. కనుకనే ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. కూటమి నేతలకు ఓ అజెండా అంటూ లేదని.. ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపడమే వారి ప్రధాన అజెండాగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న ఐదేళ్లు హిందూపురం ముఖం చూడని బాలకృష్ణ కూడా ముఖ్యమంత్రి గూర్చి మాట్లాడటం హాస్యాస్పదని మల్లాది విష్ణు అన్నారు. మరోవైపు‘సైకో పోవాలి – సైకిల్ రావాలి’ అనే పాటపై ఇప్పటికే ఈసీ నోటీసులు ఇవ్వడం జరిగిందని.. అటువంటి పాటను ఎన్నికల నియమావళికి విరుద్ధంగా మరలా బహిరంగ సభలలో ప్రదర్శించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. దీనిపై చర్యలు తీసుకోవాలని.. టీడీపీ నేత నారా లోకేష్ కు చెందిన యూట్యూబ్ ఛానల్ లో ఉన్న ఆ పాటను తక్షణమే తొలగించవలసిందిగా ఈసీని కోరినట్లు తెలిపారు. అలాగే చీఫ్ సెక్రటరీ సహా పలువురు ఉన్నతాధికారులపై ఎల్లో మీడియాలో వస్తున్న తప్పుడు కథనాలను కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలియజేశారు. మరోవైపు మాతృభూమి మీద ప్రేమ చూపించవలసిన ఎన్నారైలు కూడా.. చంద్రబాబు మాయలో పడి ముఖ్యమంత్రిపై బురదచల్లడం బాధాకరమని మల్లాది విష్ణు అన్నారు. ఎమ్మెల్యే వెంట నాయకులు రావెల కిషోర్ బాబు, అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి, వైసీపీ లీగల్ సెల్ సభ్యులు శ్రీనివాసరెడ్డి ఉన్నారు.