-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వెలంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ 32వ డివిజన్ అయోధ్యనగర్, రామలింగేశ్వరపేట తదితర ప్రాంతాలలో గురువారం ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. డివిజన్ ఇంచార్జ్ గుండె సుందర్ పాల్, కోఅప్షన్ సభ్యురాలు గుండె శుభాషిణి, వెలంపల్లి సోదరుడు వెలంపల్లి రాఘవతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. మీ అందరి ప్రేమాభిమానాలతో గత ఐదేళ్లలో సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో పయనించిందని, ఏకంగా రూ.866.84 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. ఈ అభివృద్ధి మరింతగా కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల దయాదాక్షిణ్యాల మీద సంక్షేమ పథకాలు అందేవని, కానీ నేడు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించడం జరుగుతోందన్నారు.
మోడల్ ప్రాంతంగా అయోధ్యనగర్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే అభివృద్ధి సాధ్యమని.. అయోధ్య నగర్ ప్రాంతమే ఇందుకు చక్కని ఉదాహరణ అని మల్లాది విష్ణు అన్నారు. గత ప్రభుత్వంలో 32వ డివిజన్లో ఎటు చూసినా సమస్యలే కనపడేవని.. ఈ ప్రభుత్వంలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డివిజన్లో రూ. 10 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. చంద్రబాబు హయాంలో చెరువులను తలపించిన లోటస్ ప్రాంతాన్ని.. రూ. 6 కోట్ల నిధులతో మోడల్ ప్రాంతంగా తీర్చిదద్దడం జరిగిందన్నారు. అధికారం చేపట్టిన అనతికాలంలోనే ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి.. లోటస్ సెక్టార్ ను మరో జూబ్లిహిల్స్ గా తీర్చిదిద్దిన ఘనత జగనన్న ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రూ. 40 లక్షలతో ఆర్చ్ రోడ్డును, రూ. 15.35 లక్షలతో శానిటరీ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నట్లు గుర్తుచేశారు. కనుక సీఎం జగన్ ప్రభుత్వానికి, చంద్రబాబు మోసకారి ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసాన్ని గమనించాలని ప్రజలను కోరారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, దగ్గుబాటి పురందేశ్వరిలకు విశ్వసనీయత అంటూ లేదని మల్లాది విష్ణు ఆరోపించారు. తెలుగుదేశం పేరు చెబితే జరిగిన మంచి ఒక్కటీ గుర్తుకు రాదని.. కనుకనే కూటమి నేతలందరూ కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ముప్పేట దాడి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికలలో ప్రతిపక్షాలు, పచ్చ మీడియా విష ప్రచారాలను తిప్పికొట్టాలని.. వైసీపీ అభ్యర్థులు కేశినేని నాని, వెలంపల్లి శ్రీనివాస్ లను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఒగ్గు గవాస్కర్, పేరం త్రివేణిరెడ్డి, పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.