-మంగళగిరిలో అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేసిన బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్
-వినూత్నంగా ఎడ్లబండిపై ర్యాలీగా తరలివచ్చి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఒక్క సారి అవకాశం కల్పిస్తే మీ వాడిపై మీ తోడై ఉంటానని భారత చైతన్య యువజన పార్టీ అధినేత బొడె రామచంద్ర యాదవ్ అన్నారు. ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవ్వడంతో పార్టీల అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలో రాజధాని ప్రాంతంలోని మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్ధిగా రామచంద్ర యాదవ్ ఇవేళ నామినేషన్ దాఖలు చేశారు. వినూత్నంగా ఎడ్ల బండిపై ర్యాలీగా రిజర్నింగ్ అధికారి కార్యాలయం వద్దకు తరలివచ్చిన రామచంద్ర యాదవ్ నామినేషన్ పత్రాలను సమర్పించారు.
రామచంద్ర యాదవ్ తన సొంత నియోజకవర్గం పుంగనూరుతో పాటు మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నట్లు ఇంతకు ముందే ప్రకటించారు. రాజధాని పరిరక్షణ కోసం మంగళగిరి నుండి పోటీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అవుతున్నా రాష్ట్రానికి రాజధాని లేకుండా పాలకులు చేశారని విమర్శించారు. ఈ నెల 25వ తేదీన పుంగనూరులో రామచంద్ర యాదవ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. రామచంద్ర యాదవ్ నామినేషన్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. దారి పొడవునా ఆయనకు మహిళలు హరతులు పట్టి తిలకం దిద్ది ఆశీర్వదించారు. పలు కూడళ్లలో అభిమానులు గజమాలతో సత్కరించారు.
రాష్ట్రంలో భ్రష్టుపట్టిన రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా పార్టీ స్థాపించినట్లు ఆయన చెప్పారు. బలహీన వర్గాలకు రాజ్యాధికారం, రాష్ట్రాభివృద్ధి, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం రాష్ట్రంలో రాజకీయ మార్పు అవసరమని ఆయన పేర్కొన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం గానీ, ప్రస్తుత వైసీపీ సర్కార్ గానీ ప్రజలకు రాష్ట్రాభివృద్ధికి చేసింది ఏమీ లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు కూడా పాలకుల బాధితులేనని అన్నారు. పకృతి వనరులను దోచుకోవడమే పని గా రెండు పార్టీల నేతలు పెట్టుకున్నారని విమర్శించారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలు రాజకీయంగా, ఆర్ధికంగా ఎదగాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇప్పటి వరకూ ఈ వర్గాలను ప్రధాన రాజకీయ పక్షాలు పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం, కక్షసాధింపులు, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించడం చూస్తున్నామన్నారు. రాజకీయ మార్పునకు ఒక్క సారి బీసీ యువజన పార్టీకి ప్రజలు అవకాశం కల్పించాలని రామచంద్ర యాదవ్ కోరారు.