Breaking News

పేదల ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి రాబోతోంది

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి రాబోతోందని.. అది వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వమేనని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వెలంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ 33వ డివిజన్ సత్యనారాయణపురంలో శుక్రవారం ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తి, వెలంపల్లి సోదరుడు వెలంపల్లి రాఘవతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని వివరించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ప్రతీఒక్కరికీ సంక్షేమ పథకాలను అందించి వారి జీవితాలలో వెలుగులు నింపిన గొప్ప వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి
గత ప్రభుత్వంలో కార్పొరేటర్ నుంచి ముఖ్యమంత్రి వరకు అన్ని స్థాయిలలోనూ తెలుగుదేశం ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మల్లాది విష్ణు ఆరోపించారు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సత్యనారాయణపురం అభివృద్ధిపై చక్కని ప్రణాళికతో ముందుకు వెళ్లినట్లు వెల్లడించారు. జల్లా వారి వీధి, ఓగిరాల వారి వీధి, కావూరి వారి వీధి, తిరుమలశెట్టి వారి వీధి, తాడంకి వారి వీధి, దాక్షిణ్యం వారి వీధి, పాపరాజు వీధి, కొమ్ము వారి వీధి, కనకరాజు వీధి సహా 13 వీధులలో నిర్మించిన నూతన రహదారులతో ఈ ప్రాంత ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్లయిందని తెలిపారు. నాడు-నేడులో భాగంగా AKTPM పాఠశాలలో రూ.2.62 కోట్లు, ప్రశాంతి ప్రాథమిక పాఠశాలలో రూ. 30 లక్షల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ఆరోగ్యంతో పాటు ఆహ్లాదాన్ని అందించేలా రూ. 20 లక్షల నిధులతో ఆంధ్రరత్న పార్కును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకున్నట్లు చెప్పారు. వందేళ్ల ఘన చరిత్ర కలిగిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి ఈ ప్రభుత్వంలోనే రూ. 70 లక్షల కామన్ గుడ్ ఫండ్ (CGF) నిధులు విడుదలైనట్లు మల్లాది విష్ణు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ఈ ప్రాంతంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని నిర్మించడం.. ఆర్యవైశ్యుల దశాబ్దాల కల నెరవేర్చినట్లయిందన్నారు.

ఐదేళ్లలో అక్షరాల రూ.21.31 కోట్ల సంక్షేమం
మహిళా సంక్షేమం కోసం మన రాష్ట్రంలో అమలు చేస్తునన్ని పథకాలు దేశంలో మరే రాష్ట్రంలో అమలు కావడం లేదని మల్లాది విష్ణు అన్నారు. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా డివిజన్లో ప్రతి నెలా 974 మందికి ఇంటి వద్దకే ఠంఛన్ గా పింఛన్ అందజేయడం జరుగుతోందన్నారు. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా 567 మంది అక్కచెల్లెమ్మలకు రూ. 1.65 కోట్లు., అమ్మఒడి పథకం ద్వారా 575 మంది తల్లులకు రూ. 1.74 కోట్లు., చేదోడు ద్వారా 57 మందికి రూ. 12 లక్షలు., ఈబీసీ నేస్తం ద్వారా 381 మందికి రూ. 97.65 లక్షలు., జగనన్న విద్యాదీవెన ద్వారా 476 మందికి రూ. 1.78 కోట్లు., వసతి దీవెన ద్వారా 446 మందికి రూ. 55 లక్షలు., కాపు నేస్తం ద్వారా 43 మందికి రూ.13.80 లక్షలు., సున్నావడ్డీ పథకం ద్వారా 792 మందికి రూ. 24.33 లక్షలు., వైఎస్సార్ చేయూత ద్వారా 105 మందికి రూ. 39.93 లక్షల సంక్షేమాన్ని అందజేసినట్లు తెలిపారు. మహిళలకు ఆర్థిక చేయూతనందించడం ద్వారా కేవలం ఐదేళ్ల కాలంలోనే పేదరికంపై ఈ ప్రభుత్వం నూటికి నూరు శాతం విజయం సాధించిందని మల్లాది విష్ణు అన్నారు. కనుక ఈ ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి.. వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్ లను అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు. కార్యక్రమంలో నాయకులు అఫ్రోజ్, ఒగ్గు విక్కీ, పసుపులేటి యేసు, శనగవరపు శ్రీనివాస్, మేడా రమేష్, శీలం భవానీరెడ్డి, పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *