– కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల సమన్వయ అధికారి బి.సుమిత్రా దేవి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో మిగిలిన సీట్లకు ఈ నెల 22, 23 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల సమన్వయ అధికారి బి.సుమిత్రా దేవి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకులాల్లో 2024-25 విద్యా సంవత్సరంలో 5వ తరగతిలో చేరేందుకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పరీక్షలో మెరిట్ ప్రకారం ఇప్పటికే మొదటి జాబితాలో సీట్లు కేటాయించగా మిగిలిన సీట్లకు బాలురుకు ఈ నెల 22న పామర్రులోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే విధంగా బాలికలకు ఈ నెల 23న వీరపనేనిగూడెంలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాల, కళాశాలలో కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రాతిపదికన నిర్వహించే కౌన్సెలింగ్కు మెరిట్ జాబితా ప్రకారం విద్యార్థులకు మొబైల్ మెసేజ్ ద్వారా సమాచారమిచ్చినట్లు తెలిపారు. ఉదయం 10 గంటలకు జరిగే కౌన్సెలింగ్కు ఉదయం 9 గంటలకల్లా హాజరు కావాలని.. పూర్తిసమాచారానికి బాలికలు 9704550069, బాలురు 7032703753 నంబరులో సంప్రదించొచ్చని సుమిత్రా దేవి సూచించారు.