-ఈ ఏడాది రికార్డు స్థాయిలో 86.69 మంది ఉత్తీర్ణత
-పది పరీక్షలకు 6,16,615 మంది హాజరు
-బాలికలు 3,02,005, బాలురు 3,14,610
-బాలికలు 89.17శాతం, బాలురు 84.32శాతం ఉత్తీర్ణత
-నూరు శాతం ఉత్తీర్ణత సాధించిన 2803 పాఠశాలలు
-96.37% ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం మొదటి స్థానం, 62.47% ఉత్తీర్ణతతో చివరి స్థానంలో కర్నూల్ జిల్లా
-98.43% అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని సాధించిన ఏపీ రెసిడెన్షియల్ , ఏపీ బీసీ సంక్షేమ పాఠశాలలు
-ఈ ఏడాది రికార్డు సమయంలో పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల.
-మే 24 నుండి జూన్ 3 వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహణ.
-కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ ఘటనలు లేకుండా పకడ్భందీగా పరీక్షలు
-ఈ విద్యాసంవత్సరం నుండి PEN యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అమలు.
-డిజీ లాకర్ లో అందుబాటులోకి పది ఫలితాల మార్క్స్ లిస్ట్
-పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పది ఫలితాల్లో మరోసారి బాలికలు టాప్ లో నిలిచారు. పదవ తరగతి పరీక్షా ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ విజయవాడలోని తాజ్ వివంత(గేట్ వే) హోటల్ లో సోమవారం విడుదల చేశారు. ఈ ఏడాది మార్చి 18 నుండి 30వ తేది వరకు నిర్వహించిన పది పరీక్షల్లో అత్యధికంగా 86.69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పది పరీక్షలకు 6,23,128 మంది నమోదు చేసుకోగా, 6,16,615(98.95 శాతం) మంది పరీక్షలకు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 11,646 పాఠశాలల నుండి బాలురు 3,14,610 కాగా బాలికలు 3,02,005 మంది పది పరీక్షలకు హజరయ్యారు. బాలురు 2,65,267(84.32 శాతం) ఉత్తీర్ణత కాగా బాలికలు 2,69,307(89.17 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. 2803 పాఠశాలలు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయి. రాష్ట్రవ్యాప్తంగా కనీసం ఒక్క విద్యార్థి కూడా ఉత్తీర్ణత సాధించలేక సున్నా శాతం ఉత్తీర్ణత సాధించినవిగా 17 స్కూల్స్ నిలిచాయి. పార్వతీపురం మన్యం జిల్లా రాష్ట్రంలో అత్యధిక శాతం 96.37 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలవగా, కర్నూలు జిల్లా 62.47శాతంతో అత్యల్ప ఉత్తీర్ణత సాధించి చిట్టచివరన నిలిచింది. రాష్ట్రంలోని వివిధ యాజమాన్య పాఠశాలల వారీగా చూస్తే ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలు, ఏపీ బీసీ సంక్షేమ పాఠశాలలు 98.43 శాతం ఉత్తీర్ణత సాధించి మొదటి స్థానంలో నిలిచాయి. ఈ ఏడాది విద్యాసంవత్సరం ముగియకముందు అంటే ఒక రోజు ముందే పది పరీక్షా ఫలితాలు విడుదల చేసి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. గత ఏడాది ఉత్తీర్ణత శాతం 72.74 శాతం కాగా ఈ ఏడాది 86.69 శాతం ఉత్తీర్ణత సాధించటంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఒక్క కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాకుండా పది పరీక్షలను అత్యంత పకడ్భందీగా నిర్వహించటంలో ప్రభుత్వం సూపర్ సక్సెస్ అయింది. అలాగే గతేడాది నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు 933 కాగా ఈ ఏడాది మూడింతలు పెరిగి 2803 పాఠశాలలు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఇక గతేడాది ఒక్క విద్యార్థి కూడా ఉత్తీర్ణత సాధించలేని పాఠశాలలు 38 కాగా వాటి సంఖ్య గణనీయంగా తగ్గి కేవలం 17 పాఠశాలలు మాత్రమే జీరో పాస్ పర్సంటేజ్ ను నమోదు చేసుకున్నాయి. సున్నా శాతం గా నిలిచిన పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాల ఒకటి కాగా, ఎయిడెడ్ పాఠశాలలు 3, ప్రైవేట్ పాఠశాలలు 13 ఉన్నాయి.
ఈ ఏడాది పది పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారు 4,27,067(69.26 శాతం) కాగా ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారు 73,200 (11.87 శాతం), ఇక తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారు కేవలం 34,307(5.56 శాతం). అంటే ఈ ఏడాది ఉత్తీర్ణతలో రికార్డు నెలకొల్పడంతో పాటు ఉత్తీర్ణతలో మెరుగైన ఫలితాలు సాధించి పదవ తరగతి విద్యార్థులు టాప్ లో నిలిచారు.
పది ఫలితాలను విడుదల చేసిన అనంతరం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో పరీక్షలు ఒక భాగం మాత్రమేనని ఇదే జీవితంలో సక్సెస్ పై ప్రభావం చూపదని, పది ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థులు అధైర్యపడవద్దని, క్రుంగిపోవద్దని సూచించారు. తల్లితండ్రులు సైతం ఆ విద్యార్థుల్లో స్థైర్యం నింపాలని కోరారు. పది పరీక్ష ఫలితాల కోసం www. bse.ap.gov.in వెబ్ సైట్ ను సందర్శించాల్సిందిగా కోరారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే24 నుండి జూన్ 3 వరకు నిర్వహిస్తామని చెప్పారు. ఆన్ లైన్ లో సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల లాగిన్ నుండి అప్లికేషన్ స్వీకరిస్తామని తెలిపారు. ఈ నెల 23 నుండి 30 వ తేదీ వరకు ఆలస్యరుసుం లేకుండా, మే 1, నుండి మే 23 వరకు ఆలస్య రుసుంతో (రూ. 50)అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చుని తెలిపారు. అలాగే రీ కౌంటింగ్ రూ. 500, రీ వెరిఫికేషన్ కు రూ. 1,000 దరఖాస్తు రుసుంను ఈ నెల 30వ తేదీ లోపు ఆన్ లైన్ లో చెల్లించాలని సూచించారు. పది పరీక్షల నిర్వహణకు ఆరు నెలల ముందు నుండి పకడ్భందీగా ఏర్పాట్లు చేయడంతో ఈ ఏడాది కనీసం ఒక్క కాపీయింగ్, ఒక్క మాల్ ప్రాక్టీస్ కేసు లేకుండా విజయవంతంగా పరీక్షలు నిర్వహించామని, ఇందుకు సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఇక ఈ విద్యా సంవత్సరం నుండి PEN యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ను విద్యార్థులకు కేటాయించామని చెప్పారు. ఈ ఏడాది పది పరీక్షల్లో సహాయకుడి అవసరం లేకుండ కంప్యూటర్ ద్వారా 13 మంది దివ్యాంగులు పరీక్షలు వ్రాశారని, గతేడాది ఆరుగురు విద్యార్థులు ఈ విధంగా కంప్యూటర్ ద్వారా పరీక్షలు వ్రాశారని గుర్తుచేశారు. సబ్జెక్ట్ వారీగా మార్కులతో కూడిన పదవ తరగతి ఉత్తీర్ణత దృవపత్రాలు అన్ని పాఠశాలలకు నిర్ణీత సమయంలో పంపించబడతాయని, సంబంధిత ప్రధానోపాధ్యాయుల సంతకం చేసిన తరువాత విద్యార్థులకు అందిస్తారని వివరించారు. డిజిటల్ సంతకం చేసిన మైగ్రేషన్ సర్టిఫికేషన్ ను నాలుగు రోజుల తరువాత అధికారిక వెబ్ సైట్ లో ఉంచుతామన్నారు.
కారక్రమంలో సీమ్యాట్ డైరెక్టర్ వి.ఎన్.మస్తానయ్య, సమగ్రశిక్షా ఏఎస్పీడీ డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డి, శామో డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి, ఎస్సెస్సీ బోర్డు డైరెక్టర్ డి. దేవానంద రెడ్డి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా. బి.ప్రతాప్ రెడ్డి, కేజీబీవీ సెక్రటరీ డి.మధుసూదన రావు, ఏపీఆర్ఐఈఎస్ సెక్రటరీ నరసింహారావు, ఏపీ ఓపెన్ స్కూల్ డైరెక్టర్ కె.నాగేశ్వరరావు, ఏపీ టెట్ జాయింట్ డైరెక్టర్ డా. మేరీ చంద్రిక, కాకినాడ ఆర్జేడీ జి.నాగమణి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల డీఈవోలు యు.వి.సుబ్బారావు, తాహెరా సుల్తానా తదితరులు పాల్గొన్నారు.