– జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమల్లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్‌బీసీ) పోషిస్తున్న పాత్ర కీలకమైందని.. ఇలాంటి సమితికి కన్వీనర్‌గా సీవీఎన్ భాస్కర్ బాధ్యతలు చేపట్టడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు అన్నారు. ఎస్ఎల్‌బీసీ నూతన కన్వీనర్ సీవీఎన్ భాస్కర్ మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ డిల్లీరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు నూతన కన్వీనర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. బ్యాంకు లింకేజీ, ఫైనాన్షియల్ లిటరసీ, ప్రజలకు ఆర్థిక సేవలను చేరువ చేయడం తదితర కార్యకలాపాల్లో ఎస్ఎల్‌బీసీ, లీడ్ డిస్ట్రిక్ట్ కార్యాలయాలు కీలక సేవలు అందిస్తున్నాయని పేర్కొన్నారు. అదే విధంగా ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమల్లో ఉందని.. జిల్లాలో ఎలక్షన్ సీజర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఈఎస్ఎంఎస్)ను సమర్థవంతంగా అమలుచేయడం జరుగుతోందని.. ఈ నేపథ్యంలో అనుమానిత, అసాధారణ లావాదేవీలను గుర్తించి, డేటాను విశ్లేషించడంలో లీడ్ డిస్ట్రిక్ట్ కార్యాలయం దృష్టిసారించాలని సూచించారు. కలెక్టర్ డిల్లీరావును కలిసిన వారిలో యూబీఐ రీజనల్ హెడ్ ఎం.శ్రీధర్, జిల్లా ఎల్‌డీఎం కె.ప్రియాంక, యూబీఐ సీఎం జయశ్యామ్ తదితరులు ఉన్నారు.