– జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో తాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె.ఎస్ జవహర్ రెడ్డికి వివరించారు. విజయవాడలోని సీఎస్ క్యాంప్ కార్యాలయం నుండి మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె ఎస్ జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో తాగునీరు, ఉపాధి హామీ పనులు, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీకి కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ డిల్లీరావు.. వివిధ శాఖల అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ వేసవిని దృష్టిలో పెట్టుకొని తాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నగరపాలక సంస్థ, మున్సిపల్ ఏరియా, గ్రామపంచాయతీ పరిధిలో అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ప్రతిరోజు తాగునీరు సరఫరా చేస్తున్నామని జిల్లాలో ఎటువంటి ఇబ్బంది లేదని తెలిపారు. వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకున్నామన్నారు. సాంకేతికంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే తక్షణమే పునరుద్ధరించేలా చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాలలో ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయని, గరిష్ట వేతనం అందేలా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఎక్కువ మంది కూలీలకు పని కల్పిస్తున్నామన్నారు. పనులు జరుగుతున్న చోట వేసవి దృష్ట్యా కూలీలకు అన్ని సౌకర్యాలు కల్పించామని జిల్లా కలెక్టర్ డిల్లీరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. ఎస్. జవహర్ రెడ్డికి వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ లో డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.సునీత, గ్రామీణ నీటి సరఫరా ఎస్ఈ డి.వి.రమణ, విద్యుత్ శాఖ అధికారులు ఉన్నారు.