విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ఉమ్మడి కృష్ణాజిల్లా ఎమ్మార్పీఎస్ నాయకుల సమావేశం జరిగింది. గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం జరిగిన ఉమ్మడి కృష్ణాజిల్లా ఎమ్మార్పీఎస్ నాయకుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరెల్లి ఎలీషా మాదిగ మాట్లాడుతూ సామాజిక న్యాయం చేస్తున్నామంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాదిగలకు తీరని ద్రోహం చేశారన్నారు. రాష్ట్రంలో ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ సీట్లు 29 ఉండగా అందులో మాలలకు 19, మాదిగలకు 10 కేటాయించి మాదిగలకు ద్రోహం చేశారన్నారు. జగన్ వర్గీకరణకు వ్యతిరేకమా సానుకూలమా చెప్పాలని డిమాండ్ చేశారు. వర్గీకరణకు అనుకూలంగా ఉన్న ఎన్డీయే కూటమికి రాబోయే ఎన్నికల్లో తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి గెలుపు కోసం ప్రచార కార్యక్రమాలు చేపడతామన్నారు. వైకాపా ప్రభుత్వం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేయకుండా మాదిగలకు తీరని అన్యాయం చేసిందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వర్గీకరణ కోసం సుప్రీంకోర్టులో రాష్ట్రం తరఫున కనీసం న్యాయవాదులు కూడా నియమించలేదని మండిపడ్డారు. ఎన్డీయే కూటమి గెలుపు, జగన్మోహన్ రెడ్డి ఓటమి లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఈనెల 30న విజయవాడలో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణాజిల్లా సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో నాయకులు మందా వెంకటేశ్వరరావు మాదిగ, కోటా దానియేల్ మాదిగ, అదూరి నాగమల్లేశ్వరరావు, లింగాల నర్సింహులు మాదిగ, మందా పిచ్చయ్య, కాంపాటి వెంకటేశ్వరరావు, నూకపోగు ఏసు, మామిడి రాంబాబు, చప్పిడి కాశీ, పేటేటి కిషోర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …