-అత్యంత పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
-పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేసిన రాష్ట్ర ప్రత్యేక వ్యయ పరిశీలకులు నీనా నిగం
-జిల్లాలో చేపట్టిన చర్యలను పీపీటీ ద్వారా వివరించిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
నిష్పాక్షిక పారదర్శక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల నిర్వహణలో భాగంగా చేసే ఆర్థిక లావాదేవీలు, ఖర్చులు, ఇతర వ్యయాలపై పటిష్ట నిఘా ఉంచాలని సాధారణ ఎన్నికల రాష్ట్ర ప్రత్యేక వ్యయ పరిశీలకులు నీనా నిగం పేర్కొన్నారు.
సోమవారం ఉదయం చిత్తూరు, తిరుపతి జిల్లాల ఎన్నికల కమిషన్ నుండి కేటాయించబడిన వ్యయ పరిశీలకులు…. 25- చిత్తూరు పార్లమెంట్ నియోజక వర్గ పరిశీలకులు శంకర్ ప్రసాద్ శర్మ…. పుంగనూరు, నగరి, జీ.డి నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు ఎస్. శ్రీనివాస కన్నా… చిత్తూరు, పూతల పట్టు, పలమనేరు, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు రోహన్ ఠాకూర్… 23- తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు ప్రదీప్ కుమార్… చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు విజీ శేషాద్రి…. గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు మీను ఓలా… తిరుపతి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ లతో కలిసి రెండు జిల్లాల అసిస్టెంట్ ఎక్స్పెండిచర్
అబ్జర్వర్లకు, అకౌంటింగ్ టీమ్ లకు సంబంధించిన అధికారులను భారత ఎన్నికల కమిషన్ ప్రతినిధి రాష్ట్ర ప్రత్యేక వ్యయ పరిశీలకులు నీనా నిగం సమీక్షించి దిశా నిర్దేశం చేసి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఆర్థిక లావాదేవీలు, నగదు బట్వాడా, బహుమతులు, ఇతర వస్తువులు తరలింపు, మద్యం రవాణా తదితర అంశాలపై నిరంతర పర్యవేక్షణ, నిఘా ఉండాలన్నారు. అధికారులు అందరిపట్లా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కృషి చేయాలని సూచించారు.
జిల్లాలో పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం: జిల్లా కలెక్టర్
సమావేశంలో భాగంగా ముందుగా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో నిష్పాక్షికంగా పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు చేపట్టిన చర్యల గురించి అధికారుల బృందానికి వివరించారు. 7చోట్ల అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులు, 6 అంతర్ జిల్లాల చెక్ పోస్టులు, ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు 2 ఏర్పాటుతో, ఎస్ఎస్టి, ఎఫ్ఎస్టీ, జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ బృంద ఏర్పాటుతో విసృత తనిఖీలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ధన రూపేణా రూ.1.52 కోట్లు, మద్యం 8686 లీటర్లు విలువ రూ. 51.17 లక్షలు అనీ, ఫ్రీబిలు, విలువైన లోహాలు వంటివి అన్నీ కలిపి వెరసి మొత్తం 19.64 కోట్ల విలువైన వాటిని సీజ్ చేశామని, ఈఎస్ఎంఎస్ నందు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. వివిధ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు 24X7 క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నాయని, నగదు తరలింపు, మద్యం రవాణాపై నిఘా ఉంచుతున్నాయన్నారు. 24*7 పని చేసేలా కంట్రోల్ రూమ్ నుంచి సేవలందిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట చర్యలు చేపట్టామని, అందులో భాగంగా 16 మంది నోడల్ అధికారులను నియమించామని చెప్పారు. ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థులకు వ్యయ నిర్వహణకు రిజిష్టర్, ఎన్నికల వ్యయ నిర్వహణ బుక్ లెట్ అందజేయడం జరుగుతోందని తెలిపారు. సీ-విజిల్ ద్వారా, ఇతర మార్గాల ద్వారా వచ్చే ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించామని వెల్లడించారు. జిల్లా గ్రీవెన్స్ కమిటీ(డిజిసి) ఏర్పాటు చేశామని ప్రతి రోజు రెండు సార్లు కమిటీ సమావేశమై సాధారణ పౌరుల వ్యాపారులకు సంబంధించిన నగదు సీజ్ అయి ఉంటే వాటి రికార్డులను స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మేరకు పరిశీలించి సరిగా ఉంటే వారికి తిరిగి సొమ్మును వాపసు ఇవ్వడం జరుగుతోందని, ఇప్పటి వరకు డిజీసి నుండి 44 కేసులకు గాను రూ. 83.78 లక్షలు సీజ్ చేసిన మొత్తం నుండి 43 కేసులను పరిష్కరించి రూ. 82.89 లక్షలను సంబంధిత వ్యక్తులకు సదరు సీజ్ చేసిన మొత్తాన్ని అందజేయడం జరిగిందని తెలిపారు.
నిష్పక్షపాతంగా వ్యవహరించాలి :రాష్ట్ర ప్రత్యేక వ్యయ పరిశీలకులు
ఈ సందర్భంగా రాష్ట్ర వ్యయ పరిశీలకులు మాట్లాడుతూ పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనలను అధికారులంతా తు.చ. పాటించాలని సూచించారు. ఒకరికొకరు సహకరించుకుంటూ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. సమాచార లోపం తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏమైనా సందేహాలుంటే రాష్ట్ర, జిల్లా స్థాయి ఎన్నికల అధికారులతో సంప్రదింపులు చేసి నివృత్తి చేసుకోవాలన్నారు. పార్టీలు గానీ, అభ్యర్థులు గానీ అనధికారికంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడానికి వీలులేదని, వారు చేసే ఆర్థిక లావాదేవీలపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రత్యేక గ్రీవెన్స్ కమిటీ ద్వారా సాధారణ పౌరుల నుంచి జప్తు చేసిన నగదును ఆధారాలను పరిశీలించి త్వరితగతిన వెనక్కి ఇచ్చేయాలని సూచించారు. ఆయా విభాగాల ఆధ్వర్యంలో జప్తు చేసిన నగదు, వస్తువుల వివరాలను ఈ.ఎస్.ఎం.ఎస్. పోర్టల్ లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. బ్యాంకు లావాదేవీలపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా ఎక్స్పెండిచర్ నోడల్ అధికారి చరణ్ రుద్రరాజు, ఎన్నికల సెక్షన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.