-జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేసిన సీఈవో ముకేశ్ కుమార్ మీనా
-ఏయూలోని స్ట్రాంగ్ రూమ్ వద్ద ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియ పరిశీలన
-డిస్ట్రిబ్యూషన్ సెంటర్, ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద ఏర్పాట్ల పరిశీలన, సంతృప్తి
విశాఖపట్టణం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని, సమష్టి కృషితో ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా జిల్లా అధికారులకు సూచించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సమన్వయం వహించాలని, సమర్ధంగా విధులను నిర్వర్తించాలని పేర్కొన్నారు. ఒక్క రోజు పర్యటనలో భాగంగా శనివారం ఉదయం విశాఖపట్టణం విచ్చేసిన ఆయన ముందుగా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను సందర్శించారు. అక్కడ పరిస్థితిని గమనించారు. ఈ క్రమంలో న్యూ క్లాస్ రూమ్ కాంప్లెక్సులో జరిగిన ఈవీఎం కమిషనింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ డా.ఎ. మల్లికార్జున, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, ఏడీసీ కె.ఎస్. విశ్వనాథన్ ఇతర అధికారులతో కలిసి సీఈవో సునిశితంగా పరిశీలించారు.
బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్ల పనితీరుపై శిక్షకులను అడిగి తెలుసుకున్నారు. పీవోలకు, ఏపీవోలకు ఈవీఎంల వినియోగంపై అందించిన శిక్షణ, నిర్వహించిన కార్యక్రమాలపై ఆరా తీశారు. పేర్లు, గుర్తులు ఏ విధంగా అప్ లోడ్ చేసే విధానాన్ని దగ్గరుండి పరిశీలించారు. వీవీ ప్యాట్ల ద్వారా స్లిప్పులు వస్తున్న తీరును గమనించారు. పలు అంశాలపై ప్రశ్నలు సంధించిన ఆయన వివిధ అంశాలపై సూచనలు చేశారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకోవాలని చెప్పారు. ప్రతి అంశాన్నీ చాలా సునిశితంగా పరిశీలించి పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు.
కమిషనింగ్ ప్రక్రియను పరిశీలించిన ఆయన అక్కడ కల్పించిన వసతులపై జిల్లా అధికారులను ఆరా తీశారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ కేంద్రాల చిరునామాలను తెలుపుతూ ఏర్పాటు చేసిన షైన్ బోర్డుల గురించి ఏడీసీ కె.ఎస్. విశ్వనాథన్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వివరించారు. అధికారులు, సిబ్బంది ఆయా కేంద్రాలకు చేరుకోవటంలో ఈ షైన్ బోర్డులు దోహదపడతాయని, బాగా ఏర్పాటు చేశారని సీఈవో అభిప్రాయపడ్డారు. అనంతరం ఏయూ ఇంగ్లీషు మీడియం స్కూల్ లో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తో పాటు వెళ్లి పరిశీలించారు. ఉద్యోగులు ఓటు వేసుకునేందుకు అనువుగా పక్కా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా సీఈవో జిల్లా అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లికార్జున జిల్లాలో చేపట్టిన చర్యల గురించి సీఈవోకు వివరించారు.