Breaking News

స్ట్రాంగ్ రూమ్‌ల వ‌ద్ద ప‌టిష్ట భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు పాటించాలి

-రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి ముకేశ్ కుమార్ మీనా
-జిల్లా క‌లెక్ట‌ర్, పోలీసు క‌మిష‌న‌ర్ తో క‌లిసి ఏయూ ప‌రిధిలోని స్ట్రాంగ్ రూమ్‌ల త‌నిఖీ

విశాఖ‌ప‌ట్ట‌ణం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈవీఎంలు భ‌ద్ర‌ప‌రిచిన స్ట్రాంగ్ రూమ్‌ల వ‌ద్ద అన్ని ర‌కాల‌ భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు పాటించాల‌ని, ప‌టిష్ట చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి ముకేశ్ కుమార్ మీనా పేర్కొన్నారు. అనుక్ష‌ణం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా జాగ్ర‌త్త వ‌హించాల‌ని జిల్లా అధికారుల‌కు సూచించారు. ఏయూ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల ప‌రిధిలో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్‌ల‌ను జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ డా. ఎ. మ‌ల్లికార్జున, పోలీసు క‌మిష‌న‌ర్ డా. ఎ. ర‌విశంక‌ర్ తో క‌లిసి శ‌నివారం ఉద‌యం ఆయన ప‌రిశీలించారు. విశాఖ‌ప‌ట్ట‌ణం పార్ల‌మెంటుతో పాటు, ఏడు అసెంబ్లీ నియోజక‌వర్గాల‌కు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్‌ల‌ను త‌నిఖీ చేశారు. అక్క‌డ ప‌రిస్థితులను గ‌మ‌నించారు. త‌లుపుల‌కు వేసిన తాళాల‌ను, వాటికున్న సీళ్ల‌ను సునిశితంగా ప‌రిశీలించారు. అన్ని చోట్లా సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకున్నారా లేదా అనే అంశాల‌ను అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. త‌నిఖీ అనంత‌రం లాగ్ బుక్లో సంత‌కం చేశారు. మూడెంచ‌ల భ‌ద్ర‌త‌ను పాటించాల‌ని, ఇక్క‌డి ప‌రిస్థితుల‌ను నిరంత‌రం ప‌ర్య‌వేక్షించాల‌ని క‌లెక్ట‌ర్ కు సూచించారు. అన‌ధికార వ్య‌క్తుల‌ను స్ట్రాంగ్ రూమ్‌లు ఉన్న ప్రాంతంలోకి ఎట్టిప‌రిస్థితుల్లోనూ అనుమ‌తించ‌రాద‌ని చెప్పారు. ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ నిబంధ‌న‌ల ప్ర‌కారం అన్ని ర‌కాల జాగ్ర‌త్తలు వ‌హించాల‌న్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా అక్క‌డి ప‌రిస్థితుల‌ను, జిల్లా యంత్రాంగం త‌ర‌ఫున చేపట్టిన చ‌ర్య‌లను సీఈవోకు క‌లెక్ట‌ర్, పోలీసు క‌మిష‌న‌ర్ వివ‌రించారు. ఆయ‌న వెంట జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ డా.ఎ. మ‌ల్లికార్జున‌, పోలీసు క‌మిష‌న‌ర్ డా. ఎ. ర‌విశంక‌ర్, జాయింట్ క‌లెక్ట‌ర్ కె. మ‌యూర్ అశోక్, ఆయా నియోజ‌క‌వ‌ర్గాల ఆర్వోలు, ఇత‌ర అధికారులు ఉన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *