అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గత ఏడాది ఎల్నినో ప్రభావానికి తోడు బిఫర్జాయ్ తుఫాన్ కారణంగా నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించాయి. రెండు వారాలు ఆలస్యంగా కేరళలోకి ప్రవేశించడంతో.. సీజన్ కూడా ఆలస్యంగా మొదలైంది. కానీ.. ఈ సారి నైరుతి సాధారణ సమయానికే వస్తుండడంతో జూన్ 1కల్లా కేరళ గుండా దేశంలోకి ప్రవేశించనున్నాయి. రుతుపవనాల రాకతో ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య సాధారణం కంటే కాస్త ఎక్కువగా వర్షాలు కురుస్తాయి. నైరుతి రుతుపవనాలు అండమాన్ తీరాన్ని తాకాయి.. ఈ నెల 31న కేరళలో .. జూన్ మొదటి వారంలో ఏపీలో ప్రవేశించే అవకాశం ఉంది. ఈ నెల 22న బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడం.. 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా ద్రోణి ప్రభావంతో కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం వుందని పేర్కొంది వాతావరణ శాఖ. ఇప్పటికే తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మరో నాలుగు రోజులు ఓ మోస్తారు నుంచి భారీ వర్ష సూచన ఉంది.
ద్రోణి ప్రభావంతో ఏపీలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు పరిసర ప్రాంతాలపై ఆవర్తనం కొనసాగుతోంది. ఆవర్తన నుంచి తెలంగాణ రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి ఉంది. వీటి ప్రభావంతో రాయలసీమ కోస్తాలో చెదురు మదురు వర్షాలు కురుస్తాయి. దక్షిణ అండమాన్ ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లో రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. వాస్తవానికి.. దక్షణి అండమాన్ సముద్రానికి రుతుపవనాలు 22న చేరుకోవాల్సి ఉండగా.. మూడు రోజుల ముందే పలకరించాయి. . జూన్1న రుతుపవనాలు కేరళలో ప్రవేశించి జులై 15 కల్లా దేశవ్యాప్తంగా విస్తరిస్తాయి. రుతుపవనాల రాకతో ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. మరో మూడు రోజుల పాటు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు..కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం వుందని ప్రకటించింది వాతావరణ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.