-ఎన్నికల సంఘాన్ని కోరిన వైసీపీ బృందం
-4 అంశాలపై ఫిర్యాదులను అందించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఎన్నికల సంఘాన్ని వైసీపీ బృందం కోరింది. ఈ మేరకు ఆదివారం వెలగపూడి సచివాలయం నందు అడిషనల్ సీఈవో కోటేశ్వరరావును కలిసి ఫిర్యాదునందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు తమకు ఓటు వేయలేదనే ఉక్రోషంతో.. తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా హింసను ప్రోత్సహిస్తోందని మల్లాది విష్ణు ఆరోపించారు. పలు ప్రాంతాలలో తెలుగుదేశం అభ్యర్థులే రోడ్లపైకి వచ్చి దాడులకు తెగబడుతూ.. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. కౌంటింగ్ సమయంలోనూ తెలుగుదేశం అల్లర్లను సృష్టించే అవకాశం ఉందని.. కనుక ఎక్కడా శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరామన్నారు. అలాగే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సమయంలో పాటించవలసిన రూల్స్ ను 175 నియోజకవర్గాలలోనూ తూచాతప్పకుంగా పాటించేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని.. ఎక్కడా అవకతవకలు జరగకుండా చూడాలని ఈసీని కోరినట్లు తెలిపారు. మరోవైపు తెలుగుదేశం అధికారంలో ఉండగా చింతమనేని ప్రభాకర్ చేసిన దారుణాలు అన్నీఇన్నీ కావని.. ఏకంగా ప్రభుత్వ అధికారులపైనే దాడులకు తెగబడిన సందర్భాలు చూశామని మల్లాది విష్ణు అన్నారు. తాజాగా పోలింగ్ రోజు దెందులూరు నియోజకవర్గం కొప్పులవారిపాలెం జరిగిన ఓ దాడి ఘటనలో టీడీపీకి చెందిన రాజశేఖర్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. చింతమనేని ప్రభాకర్ స్టేషన్ పైననే దాడి చేసి పోలీసులపైన దౌర్జన్యం చేశారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. తక్షణమే చింతమనేనిని అరెస్ట్ చేసి.. ఆయనపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పోటీ చేస్తున్న టెక్కలి నియోజకవర్గంలో.. తెలుగుదేశం అరాచకాలకు ఓ నిండు ప్రాణం బలైందని మల్లాది విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు. నిమ్మాడ గ్రామంలో పోలింగ్ సమయంలో టీడీపీ అరాచకాలను అడ్డుకున్న వైసీపీ బూత్ ఏజంట్ తోట మల్లేష్ ఇంటిపై దాడికి తెగబడి.. అతని చావుకు కారణమయ్యారని మండిపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే అచ్చెన్నాయుడిపైనా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈసీకి ఫిర్యాదును అందజేశామన్నారు. మరోవైపు గురజాల, మాచర్ల, నరసరావుపేట, సత్తెనపల్లి, తాడిపత్రి సహా రాష్ట్రంలో జరిగిన అరాచకాలన్నింటికీ మూలకారణం తెలుగుదేశం, ఆ పార్టీ నాయకులని మల్లాది విష్ణు విమర్శించారు. కానీ సిట్ ను తప్పుదోవ పట్టించేలా స్థానిక వైసీపీ అభ్యర్థులపై ఫిర్యాదులు చేస్తూ గందరగోళపరుస్తున్నారని నిప్పులు చెరిగారు. ఆయా ఘటనలకు సంబంధించి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయవలసిందిగా సిట్ అధికారులను కోరారు. ఎమ్మెల్యే వెంట నవరత్నాల కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి ఉన్నారు.