-ఈ దశను విజయవంతంగా నిర్వహించడంలో అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సహాయసహకారాలు అందించాలి
-జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాజకీయ పార్టీల అభ్యర్థులు, ప్రతినిధుల సహకారంతో ప్రజాస్వామ్య స్ఫూర్తితో జిల్లాలో పోలింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని.. ఇదే స్ఫూర్తిని కొనసాగించి సరైన సహకారమందించి కౌంటింగ్ ప్రక్రియను విజయవంతం చేయడంలో భాగస్వాములు కావాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు కోరారు.
సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు శుక్రవారం రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులతో కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. జూన్ 4న ఇబ్రహీంపట్నం, జూపూడిలోని నోవా, నిమ్రా కళాశాలల్లో నిర్వహించనున్న కౌంటింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఈవీఎంలో నమోదైన ఓట్లతో పాటు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించే విధానంలో వివిధ దశలను క్షుణ్నంగా వివరించారు. కౌంటింగ్ ఏజెంట్ల నియామకానికి సంబంధించి అర్హతలు, కౌంటింగ్ హాల్‌లో ప్రవర్తనా నియమావళి, గోప్యతా నిర్వహణ, కౌంటింగ్ హాలు లే అవుట్ తదితరాలతోపాటు వివిధ ఫారాల సమాచారాన్ని వివరించారు. అభ్యర్థులు 18 ఏళ్లు, ఆపై ఉన్నవారిని కౌంటింగ్ ఏజెంట్‌గా నియమించుకోవాలన్నారు. అభ్యర్థి కౌంటింగ్ టేబుళ్ల సంఖ్య ఆధారంగా ఏజెంట్లను నియమించుకోవచ్చన్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని.. అందువల్ల ఏడు గంటలకల్లా కౌంటింగ్ ఏజెంట్లు హాజరై ఉండాలన్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 1,792 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఓట్ల లెక్కింపునకు ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్లు చొప్పున ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్లకు అనుమతి లేదని.. ఒకవేళ ఎవరైనా తీసుకొస్తే వాటిని భద్రపరచడం కోసం నియోజకవర్గాల వారీగా ప్రత్యేక కలెక్షన్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్ ఏజెంట్ నియామకపత్రాన్ని, గుర్తింపు కార్డును రిటర్నింగ్ అధికారికి చూపించిన తర్వాత కౌంటింగ్ హాల్‌లోకి అనుమతించడం జరుగుతుందన్నారు. కౌంటింగ్ హాల్‌లో కచ్చితమైన క్రమశిక్షణ పాటిస్తూ రిటర్నింగ్ అధికారికి సహకరించాలన్నారు. రౌండ్ల వారీగా ఫలితాలు తెలియజేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా కౌంటింగ్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో పటిష్ట భద్రత మధ్య నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. కౌంటింగ్ ఏజెంట్లు, అభ్యర్థులు, అధికారులు, సిబ్బంది తదితరులకు అల్పాహారం, భోజనం, తాగునీరు వంటి సదుపాయాలు కల్పించడం జరుగుతుందని.. ఎన్నికల ప్రక్రియలో ఓట్ల లెక్కింపు అనేది ఓ కీలక ఘట్టమని.. ఈ దశను విజయవంతంగా నిర్వహించడంలో అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తి సహాయసహకారాలు అందించాలని కలెక్టర్ డిల్లీరావు కోరారు. సమావేశంలో అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, డీఆర్‌వో వి.శ్రీనివాసరావు, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి శ్రీనివాసరావు, ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ దుర్గాప్రసాద్ తదితరులు హాజరయ్యారు.