తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీనివాసునికి అనేక పుష్పమాలలతో, తులసిమాలలతో, అనునిత్యం చేసే సేవాకైంకర్యమే. “తోమాలసేవ”. తమిళంలో ‘తోడుత్తమాలై’ అంటే నారతో కట్టిన మాల అని అర్థం. కాలక్రమంలో అదే ‘తోమాల’ గా మారి ఉండవచ్చు. ‘తోల్’ అంటే భుజం అని అర్థం. భుజం నుంచి వ్రేలాడే మాలలు గనుక ‘తోమాలలు’ అని అంటారు.
ముందురోజు రాత్రే ఆయా కాలాల్లో లభించే అనేక రకాల, రంగురంగుల, పరిమళ పుష్పాలతో తయారు చేయబడిన పుష్పమాలికలను, విమాన ప్రదక్షిణం లోని యోగనరసింహస్వామి ఆలయం ప్రక్కనపున శీతల పుష్పఅర లో సిధ్ధం చేస్తారు. మూలవిరాట్టుకు నవనీత హారతిని సమర్పించగానే భోగశ్రీనివాసునుకి జరిగే అభిషేకంతో “తోమాలసేవ” ప్రారంభమవుతుంది. బంగారుబావిలో నిలువ ఉంచబడిన ఆకాశగంగ తీర్థంతో భోగశ్రీనివాసునుకి అభిషేకం చేస్తారు.
తరువాత – శ్రీవేంకటేశ్వరస్వామి (మూలవిరాట్టు) వారి నిజపాదాలపై ఉన్న బంగారు తొడుగులకు కూడా అభిషేకం చేస్తారు. వేదపండితులు పురుషసూక్తం పఠిస్తూండగా, అర్చకులు శ్రీవారి సన్నిధిలోని – నృసింహ, శ్రీరామ సాలగ్రామాలకు కూడా అభిషేకం చేస్తారు. అనంతరం మూలమూర్తికీ, వక్షస్థలలక్ష్మికీ, శ్రీదేవీ భూదేవి సహిత మలయప్పస్వామికీ, ఉగ్రశ్రీనివాసునికి – ఇలా సన్నిధిలో వున్న పంచబేరాలకు, అభిషేకం చేయించినట్లుగా ఆకాశగంగ తీర్ధంతో సంప్రోక్షిస్తారు.
శ్రీవారికి పుష్పాలంకరణ
ఉత్సవమూర్తు లందరికీ అభిషేకాదులు జరిగిన వెనువెంటనే – జియ్యంగారు పూలమాలలు ఉన్నట్టి వెదురుగంపను తలపై పెట్టుకుని, ఛత్రచామర మర్యాదలతో, పలకగంట సన్నడోలు మ్రోగుతుండగా, సన్నిధిగొల్ల దివిటీతో దారి చూపుతుండగా, పుష్పఅర నుండి బయలుదేరి ధ్వజస్తంభానికి ప్రదక్షిణ చేసి, వెండివాకిలి ద్వారా లోనికి వచ్చి, విమానప్రదక్షిణ చేసి, బంగారు వాకిలి ద్వారా, శ్రీవారి సన్నిధిలో ఉన్న అర్చకులకు అందజేస్తారు. అర్చకస్వాములు ఈ మాలలను స్వీకరించి, నీళ్లతో శుద్ధి పరుస్తారు. ఆ మాలలతో ముందుగా భోగశ్రీనివాసుణ్ణి అలంకరించి, ఆ తరువాత మూలమూర్తికి కంఠంలోనూ, హృదయం పైనా పుష్పమాలు వేసి, శంఖుచక్రాలను, కిరీటాన్ని, నందకఖడ్గాన్ని అలంకరిస్తారు. ఆ తరువాత భుజాలమీదుగా నాభి వరకు, నడుమువరకు, ఊరువులవరకు, మోకాళ్ళవరకు, పాదాలవరకు వ్రేలాడునట్లుగా పొడవైన పూలదండలను అలంకరిస్తారు. ఈ పుష్పాలంకరణం శ్రీవారి పాదాలతో మొదలవుతుంది. అమలులో ఉన్న ఆచారం ప్రకారం, శ్రీవారికి శిఖామణిని అలంకరించేటప్పుడు. తెరవేసి మరలా తీస్తారు.
మాలలకు పేర్లు
ఆపాదమస్తకం అలంకరింపబడే ఈ పుష్పమాలలకు కొన్ని స్థిరమైన పేర్లు ఉండటం విశేషం – శ్రీవారి పాదాలపై అలంకరించే ఒక్కక్క మూర గల రెండు పుష్పమాలలను తిరువడి దండలు అంటారు.
శ్రీవారి కింం మీదుగా రెండు భుజాలవరకు అలంకరింపబడే 8 మూరల పుష్పమాలను శిఖామణి శ్రీవారి భుజాలనుండి ఇరువైపులా పాదాలవరకు వ్రేలాడునట్లుగా అలంకరించే పొడవాటి మాలను సాలగ్రామ అంటారు.
శ్రీవారి మెడలో రెండు వరుసలుగా భుజాలమీదికి అలంకరించబడే మూడున్నర మూరల పుష్పహారాన్ని కంఠసరి అంటారు.
శ్రీవారి పక్షఃస్థలంలో ఉన్న శ్రీదేవి – భూదేవిలకు ఒకటిన్నర మూరల పొడవుండే రెండు పుష్పమాలికలను వక్షస్థలమాలలు లేదా వక్షఃస్థల తాయార్ల సరాలు అంటారు.
ఒక్కొక్కటి ఒక్కొక్క మూర ఉన్న రెండు దండలను శంఖుచక్రాలకు అలంకరిస్తారు. వీటిని శంఖుమాల, చక్రమా అంటారు. శ్రీవారి నందకబడ్డానికి అలంకరించే రెండు మూరల పుష్పమాలికను కఠారిసరం అంటారు.
రెండు మోచేతుల క్రింద నుండి పాదాలవరకు వ్రేలాడదీసే రెండు పుష్పమాలలను తావళములు అంటారు. వీటిలో ఒకటి 40 అంగుళాలు మరియొకటి 50 అంగుళాల పొడవు ఉంటాయి. వీటిని శ్రీవారికి ఇంగ్లీషు అక్షరం U ఆకారంలో ధరింపజేస్తారు.
అర్చకస్వాములు శ్రీదేవీ-భూదేవి సమేతుడైన మలయప్పస్వామికీ, ఉగ్రశ్రీనివాసమూర్తికి, కొలువు శ్రీనివాసమూర్తికి, సీతాలక్ష్మణ సమేతుడైన కోదండరామస్వామికి, రుక్మిణీ సమేతుడైన శ్రీకృష్ణునికీ, చక్రత్తాళ్వార్ కు మరియు సాలగ్రామాలకు పుష్పమాలలు అలంకరిస్తారు.
పుష్ప మాలాలంకరణ పూర్తయిన తరువాత వేదపండితులు మంత్రపుష్పాన్ని సమర్పిస్తారు. ఆ తరువాత స్వామివారికి ధూప, దీప, నక్షత్రహారతులు, చివరగా కర్పూరహారతి సమర్పిస్తారు.
ఈ సేవ సుమారు అరగంటకు పైగా జరుగుతుంది.
నిత్యార్చనలో భాగంగా జరిగే ఈ తోమాలసేవ, ఉదయం విస్తారంగా, మధ్యాహ్నం క్లుప్తంగా మరల సాయంత్రం విస్తారంగా – ముప్పూటలా జరుగుతుంది. ఉదయం జరిగే తోమాలసేవ మాత్రమే అర్జితసేవ. అప్పుడు మాత్రమే ఈసేవను భక్తులు దర్శించుకోగలరు. మధ్యాహ్నం, రాత్రి జరిగే తోమాలసేవలు ఏకాంతంగా జరుగుతాయి. ఈ మాలలన్నింటినీ మూర (18 అంగుళాలు), బార (36 అంగుళాలు) కొలమానంతో వ్యవహరిస్తారు. అంతటితో తోమాలసేవ ముగిస్తుంది.