కృష్ణా యూనివర్సిటీ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం కృష్ణా యూనివర్సిటీలోని ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. మంగళవారం రోజున ఓట్ల లెక్కింపు జరుగనున్న నేపథ్యంలో విభాగాల వారీగా ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. పరిశీలనలో ముందుగా ఆయన ఆయా నియోజకవర్గాల కౌంటింగ్ హాళ్లలోకి ప్రవేశించే సిబ్బంది, పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్ల మొబైల్ ఫోన్లను భద్రపరిచేందుకు కృష్ణా యూనివర్సిటీ ప్రాంగణం వద్ద నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన సెల్ ఫోన్లు భద్రపరచు కౌంటర్ ను పరిశీలించి ఎలాంటి గందరగోళం లేకుండా తగు రీతిలో కౌంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. యూనివర్సిటీ ప్రాంగణం నుండి నియోజకవర్గాల వారీగా కౌంటింగ్ హాళ్ళకు చేరుకునేందుకు అభ్యర్థులు, ఏజెంట్లు, కౌంటింగ్ సిబ్బందికి అర్థమయ్యే రీతిలో పెద్ద అక్షరాలతో సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. యూనివర్సిటీ పరిపాలన భవనం వద్ద ఏర్పాటు చేసిన పెయిడ్ క్యాంటీన్ ప్రదేశమును మార్చాలని, దాన్ని నిర్మాణంలో ఉన్న ఫార్మసీ భవనం దగ్గరకు మార్చాలని సూచించారు. ఓట్ల లెక్కింపు రోజున ఎలాంటి గందరగోళం లేకుండా రౌండ్ ల వారీగా మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంతో పాటు ఏడు నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలను మీడియా వారికి చేరవేయడం, అదేవిధంగా ఫలితాలను ప్రకటించడంలో కమ్యూనికేషన్ సెంటర్ విభాగం అధికారులు జాగ్రత్త వహించాలన్నారు.
తదుపరి ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అకాడమిక్ భవనంలోని పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం కౌంటింగ్ హాళ్లలోని ఏర్పాట్లను పరిశీలించారు. ఈ క్రమంలో మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు అసెంబ్లీ నియోజకవర్గ పోస్టల్, కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలకులు జాన్ కింగ్స్ లే ఐఏఎస్ కు జిల్లా ఎన్నికల అధికారి వివరించారు. అనంతరం ఆయన కౌంటింగ్ సిబ్బందికి ఓట్ల లెక్కింపు కు ముందు రోజు రాత్రి రుద్రవరం గురుకుల పాఠశాల, మచిలీపట్నంలోని సాంఘిక సంక్షేమ శాఖ వారి ప్రభుత్వ కళాశాల బాలికల వసతి గృహం నెం.2లో ఏర్పాటు చేస్తున్న వసతి సౌకర్యాలను పరిశీలించారు.
ఈ పర్యటనలో జిల్లా ఎన్నికల అధికారి వెంట జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, డిఆర్ఓ కె చంద్రశేఖర రావు, అదనపు ఎస్పీ ఎస్వీడీ ప్రసాద్, రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.