-జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సాధారణ ఎన్నికలు-2024 నిర్వహణలో ఉపయోగించిన ఈవీఎం, వీవీప్యాట్లను కట్టుదిట్టమైన భద్రతతో గోదాములో భద్రపరిచినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు వెల్లడించారు. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పూర్తయినందున గొల్లపూడిలోని గోదాములో ఈవీఎం, వీవీప్యాట్లను భద్రపరిచి సీల్ వేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు.. అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఈ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఎన్నికల ఇతర సామగ్రిని భద్రపరిచే కలెక్టరేట్‌లోని గోదామును పరిశీలించి దానికి కూడా సీల్ వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ ఈసీఐ, సీఈవో మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం, వీవీప్యాట్లు, ఇతర ఎన్నికల సామగ్రిని భద్రపరిచినట్లు తెలిపారు. ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎం, వీవీప్యాట్లను పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా గొల్లపూడిలోని గోదాములో భద్రపరిచినట్లు తెలిపారు. అదేవిధంగా ఎన్నికల ప్రక్రియలో ఉపయోగించిన స్టాట్యుటరీ కవర్స్, ఫారాలు, రిజిస్టర్లు వంటి ఇతర ఎన్నికల సామగ్రిని జిల్లా కలెక్టరేట్‌లోని ప్రత్యేక గోదాములో సురక్షితంగా భద్రపరిచినట్లు కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.
కార్యక్రమంలో డీఆర్‌వో వి.శ్రీనివాసరావు, ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ ఎం.దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.