Breaking News

నరేంద్ర మోదీ కి మద్దతు ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నాం

-మోదీ సూచనలు, సలహాలను ఆంధ్రప్రదేశ్ పాలనలోనూ తీసుకుంటాం
-రాష్ట్రానికి ఎన్టీయే ప్రభుత్వ సంపూర్ణ సహకారం ఉండాలని ఆకాంక్షిస్తున్నాను
-ఢిల్లీలో జరిగిన ఎన్టీయే పక్ష నాయకుడి ఎన్నిక కార్యక్రమంలో మాట్లాడిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యణ్ 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
‘భారత జాతి యావత్తుకు స్ఫూర్తి అందించిన నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఇటు కామాఖ్య నుంచి ద్వారక వరకు ప్రతి ఒక్కరిలో గొప్ప జాతి సమైక్యతను నింపిన ప్రధాని. దేశాన్ని ప్రపంచ దేశాల ముందు గర్వంగా తలెత్తుకునేలా చేసిన గొప్ప నేత. ఆయనను ఎన్టీయే పక్ష నేతగా ఎన్నుకునేందుకు జనసేన పార్టీ సంపూర్ణమైన మద్దతును ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నామ’ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని పాత పార్లమెంటు భవన్, సెంట్రల్ హాలులో శుక్రవారం ఎన్టీయే పక్ష నేత ప్రధాని నరేంద్ర మోదీ ని ఎన్నుకునే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘ఆసేతు హిమాచలం మోదీ పాలనలో భద్రంగా ఉంది. దేశం ఆర్థికంగానూ పరుగులు తీసింది. అన్ని రంగాల్లోనూ దేశం అభివృద్ధి పంథాలో ముందుకు సాగుతోంది. ప్రపంచ దేశాల ముందు దేశం ప్రతిష్టను మోదీ ఇనుమడింపజేశారు. ఆంధ్రప్రదేశ్ లో సైతం ఎన్టీయే కూటమిలోని తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు 91 శాతం అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించాయి. 2014లో సైతం నేను ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల సభల్లో మోదీ దేశానికి పదిహేనేళ్లు ప్రధానిగా ఉండాలని, అప్పుడే దేశం దశ, దిశ మారుతుందని చెప్పాను. ఇప్పుడు ఆ మాట నిజమవుతోంది. దేశానికి మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. మోదీ విజన్ 2047కు భారతదేశం అన్ని విధాలా అభివృద్ధి చెందిన దేశంగా తయారు కావాలనేది భారతీయులందరి ఆకాంక్ష. అది నెరవేరుతుందని నమ్ముతున్నాను. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల సభల్లో మోదీ సైతం ఉత్సాహంగా పాల్గొని ఎన్టీయే కూటమి విజయానికి బాటలు వేశారు. రాబోయే ఎన్టీయే ప్రభుత్వ హయాంలోనూ ఆంధ్రప్రదేశ్ కు సంపూర్ణం సహకారం ఉంటుంద”ని ఆకాంక్షిస్తున్నాను. మోదీ సలహాలు, సూచనలతో ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడే ఎన్టీయే ప్రభుత్వం ముందుకు సాగుతుంది. జనసేన పార్టీ తరఫున ఎన్టీయే కూటమి పక్ష నేతగా నరేంద్ర మోదీ కి పూర్తి మద్దతును ఇస్తూ, దేశాన్ని ఆయన మరింత సమర్థంగా ముందుకు తీసుకెళ్తారని బలంగా నమ్ముతున్నాను. జనసేన పార్టీ తరపున, ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా నరేంద్ర మోదీకి నేను మద్దతు ప్రకటిస్తున్నాను. ఇక్కడున్న ప్రముఖులు, సీనియర్ పార్లమెంటేరియన్లు, నూతన పార్లమెంటు సభ్యులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సీనియర్ నాయకులు.. ఎన్డీయే భాగస్వాములందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు” అన్నారు.

పవన్ కాదు తుపాను : నరేంద్ర మోదీ
ఎన్డీయే పక్ష నాయకుడిగా ఎన్నికయిన తదుపరి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ పై ప్రశంసలు కురిపించారు.  మోదీ మాట్లాడుతూ “ఆంధ్ర ప్రదేశ్ అతిపెద్ద విజయం అందించింది. ఈ విజయం సామాన్యుడి ఆకాంక్షకు ప్రతిరూపం. చంద్రబాబు, పవన్ కల్యాణ్ వల్లే ఇది సాధ్యమైంది. ఇక్కడ మనతో పవన్ ఉన్నారు. పవన్ అంటే పవనం కాదు. తుపాను” అన్నారు. ప్రజల కలలను సాకారం చేసే విధంగా ఎన్డీయే పని చేస్తుందని చెప్పారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *