విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నేటి నుంచి (జూన్ 8) నుంచి మృగశిర కార్తె ప్రారంభం కానుంది. ఆశ్విని మొదలుకుని రేవతి వరకు మనకున్న 27 నక్షత్రాల్లో సూర్యుడి ప్రవేశం ఆధారంగా కార్తె నిర్ణయం జరుగుతుంది. భారతీయ జ్యోతిష్య సాంప్రదాయం ప్రకారం.. ఒక్కో కార్తెలో ఒక్కో విధంగా ప్రకృతిలో మార్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించిన నాటినుంచి నైరుతి రుతుపనాలు వస్తాయి. వాతావరణం ఒక్కసారి చల్లబడటం, ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి.
ఈ రోజు నుండి మృగశిర కార్తె …ప్రత్యేకత ఏమిటంటే?
మృగశిర కార్తె మొదటి రోజును దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మృగశిర, మృగం, మిరుగు, మిర్గం అనే పేర్లతో పిలుస్తారు. మృగశిర కార్తె ప్రారంభంతో వేసవి తీవ్రత తగ్గుముఖం పట్టి తొలకరి జల్లులు ప్రారంభం అవుతాయి. నైరుతి రుతుపవనాల ఆగమనం కూడా మొదలవుతుంది. ఈ రోజు ప్రజలు బెల్లంలో ఇంగువ కలుపుకొని తింటారు. ఇది శరీరంలో ఉష్ణోగ్రత ప్రేరేపించి వర్షాకాలంలో సోకే వ్యాధులను అడ్డుకుంటుందని పెద్దల విశ్వాసం. అంతేకాదు ఈ కార్తె రోజు చేపలు తప్పకుండా తింటారు.