-అర్హులైన అందరికీ అక్రిడిటేషన్లు మంజూరు
-ఏపీయూడబ్ల్యూజే నేతలకు మంత్రి పార్థసారధి హామీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి త్వరలోనే అవసరమైన చర్యలు తీసుకుంటామని గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారధి హామీ ఇచ్చారు. సమాచారశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పార్థసారధిని ఆయన క్యాంపు కార్యాలయంలో శనివారం రాత్రి ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధానకార్యదర్శి చందు జనార్థన్, విజయవాడ యూనిట్ అధ్యక్షులు చావా రవి, ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు కంచల జయరాజ్, కార్యదర్శి దాసరి నాగరాజు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దారం వెంకటేశ్వరరావు, సామ్నా రాష్ట్ర ప్రధానకార్యదర్శి సీహెచ్ రమణారెడ్డి, విజయవాడ నగర అధ్యక్షులు ఎం.సుబ్బారావు, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ నాయకులు నాగమలేశ్వరరావు తదితరులు మంత్రిని కల్సి దుశ్శాలువతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈసందర్భంగా గత ఐదు సంవత్సరాల కాలంలో జర్నలిస్టులు ఎదుర్కొన్న ఇబ్బందులను నేతలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై మంత్రి స్పందిస్తూ పరిష్కారానికి నోచుకోని జర్నలిస్టుల సమస్యల వివరాలను తనకు అందజేయాలని, దానిపై సంబంధిత శాఖాధికారులతో చర్చించి అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు మంజూరు చేస్తామని,మిగిలిన సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేస్తానని చెప్పారు. మీట్ ద ప్రెస్ కార్యక్రమానికి ఆహ్వానించగా, త్వరలోనే హాజరవుతానని తెలిపారు.