-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సహజసిద్దమైన ప్రకృతి అందాలతో అలరారే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ది పరుస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం 5.50 గంటల సమయంలో వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం రెండో బ్లాక్ లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రూ.2.31 కోట్ల అంచనా వ్యయంతో 10 టూరిజం బోట్లను కొనుగోలు చేసే ఫైలుపై తొలి సంతకం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 974 కిలోమీటర్ల సముద్రతీర ప్రాంతంతో మరియు సహజ సిద్ధమైన ప్రకృతి అందాలతో అలరారే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పర్యాటక పరంగా ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. పర్యాటకం మరియు కళల పట్ల ప్రత్యేక శ్రద్ద ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మరియు పర్యావరణ హితమైన పర్యాటకాన్ని అభివృద్ది పర్చాలనే ఆలోచన ఉన్నటు వంటి ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాన్ నేతృత్వంలో రాబోయే ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అద్బుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చుదిద్దుతామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని వనరులు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. ఉత్తరాంద్ర, తూర్పుగోదావరి మరియు రాయలసీమ ప్రాంతాల్లో ప్రకృతి శోభతో అలరారే విస్తారమైన అటవీ ప్రాంతంతో పాటు ఎన్నో ప్రముఖ దేవాలయాలు కూడా రాష్ట్రంలో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో సహసిద్దంగా ఉన్న ఇటు వంటి వనరులను అన్నింటినీ సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్రంలో పర్యావరణ పర్యాటకం, ఆలయ పర్యాటకం, అడ్వెంచర్ పర్యాటకం అభివృద్ధితో పాటు పర్యాటక బోట్ల సౌకర్యాన్ని కూడా పెద్ద ఎత్తున మెరుగుపరుస్తామన్నారు.
అదే విధంగా రాష్ట్రంలో సినిమాల చిత్రీకరణకు ఎన్నో అందమైన లొకేషన్లు, ప్రాంతాలు ఉన్నాయని, సినీ రంగ పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన స్టూడియోల నిర్మాణానికి రాష్ట్రం ఎంతో అనుగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో స్టూడియోల నిర్మాణానికి, మౌలిక వసతుల మెరుగు సినీ రంగ ప్రముఖులు, నిర్మాతలు రాష్ట్రానికి పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన ఆహ్వానించారు.
గత ప్రభుత్వ హయాంలో పర్యాట రంగం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి గురైందని, పర్యాటకానికి విఘాతం కలిగించే విధంగా ప్రభుత్వ పాలసీ ఉండటం వల్ల దేశ విదేశాల నుండి రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్య పూర్తిస్థాయిలో తగ్గిపోయిందన్నారు. ప్రత్యేకించి విదే పర్యాటకుల సంఖ్య 63 శాతానికి పడిపోయిందన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్దికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా పర్యాటక నిధులను సొంత ప్రయోజనాల కోసం వాడుకోవడం జరిగిందన్నారు. పర్యాటక కేంద్రాలుగా విరాజిల్లాల్సిన ప్రాంతాలను సొంత ప్రయోజనాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పర్యాటక నిధులను దుర్వినియోగం చేయడం జరిగిందని ఆయన విమర్శించారు.
వేద మంత్రోచ్ఛారణల మధ్య బాధ్యతలు చేపట్టిన మంత్రి కందుల దుర్గేష్…
గురువారం సాయంత్రం 5.50 గంటల సమయంలో వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా కందుల దుర్గేష్ బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయం రెండో బ్లాక్ మొదటి అంతస్తులో ఆయనకు కేటాయించిన ఛాంబరులో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఎంతో ఘనంగా రాష్ట్ర మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా భాద్యతలు చేపట్టేందుకు రాష్ట్ర సచివాలయానికి విచ్చేసిన ఆయనకు వేదపండితులు పూర్ణకుంభంతోను అధికారులు పుష్పగుచ్ఛాలతోను ఘనంగా స్వాగతం పలికారు. పండితుల వేదమంత్రాల మధ్య శాస్త్రోత్తంగా ఆ భగవంతునికి శోడషోపచార పూజలు జరిపిన తదుపరి తమ సీటులో ఆసీనులయ్యారు.
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి మరియు ఏపీ టూరిజం డెవలప్మెంట్ అథారిటీ సీఈవో కన్నబాబు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పద్మావతి, ఏపీటీడీఏ డైరెక్టర్లు కనకదుర్గ, గోపాల నాయుడు, ఏపీటీడీసీ డివిజనల్ మేనేజర్ చైతన్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ మరియు నాటక రంగ అభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్ శేషసాయి మరియు పలువురు అధికారులు, అనధికారులు మంత్రికి పుష్పగుచ్చాలు అందజేస్తూ అభినందనలు తెలిపారు.