Breaking News

యోగా భారతదేశానికి గర్వకారణం

-అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
-చల్లపల్లిలో ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవం
-శ్రీకృష్ణుడు, గౌతమ బుద్ధుడు, మహావీరుడు యోగాను ప్రోత్సహించారు
-మరుగున పడిన యోగాకు ప్రధాని మోడీ పునరుజ్జీవనమిచ్చారు
-పిల్లలకు యోగా నేర్పించి భావితరాలకు అందించాలి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
యావత్ ప్రపంచం యోగా వైపు చూడటం భారతదేశం గర్వించదగ్గ విషయం అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శుక్రవారం ఉదయం చల్లపల్లిలోని ఎన్టీఆర్ గ్రామ పంచాయతీ పార్కులో ప్రపంచ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ యావత్ మానవాళికి భారతదేశం అందించిన మహోన్నత యోగాను ఐక్య రాజ్య సమితి గుర్తించటం, 2014లో ప్రధాని మోడీ చొరవ మేరకు ప్రపంచ దేశాలు ప్రతి ఏటా జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయం తీసుకోవటం గర్వకారణం అన్నారు. శారీరక మానసిక వికాసం అందించే యోగా భారతదేశంలో వేద కాలం నుంచి ఉందన్నారు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో యోగాకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. బౌద్ధ, జైన మతాల్లో గౌతమ బుద్ధుడు, మహావీరుడు యోగాకు ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. కాలక్రమేణా మరుగునపడిన యోగాను ప్రధాని మోడీ పునరుజ్జీవింప చేశారన్నారు. ప్రతి ఒక్కరూ యోగా నేర్చుకోవాలని, ముఖ్యంగా నేటితరం పిల్లలకు యోగా నేర్పించి భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సత్యసాయి ధ్యాన మండలి, లంకపల్లి సత్యసేవా యోగమండలి సంయుక్త ఆధ్వర్యంలో యోగా గురువు శ్రీనివాస్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్వచ్ఛ సుందర చల్లపల్లి కన్వీనర్లు డాక్టర్ డీ.ఆర్.కే ప్రసాద్ – డాక్టర్ టీ.పద్మావతి, బీజేపీ నియోజకవర్గ కో కన్వీనర్ తుంగల వెంకటగిరి, ఉప సర్పంచ్ ముమ్మనేని రాజకుమార్ (నాని), విశ్రాంత ఈఓఆర్డీ దాసి సీతారామరాజు, రంగస్థల పౌరాణిక కళాకారుడు బోలెం రామారావు, మాజీ వైస్ ఎంపీపీ బోలెం నాగమణి, రాయపాటి రాధాకృష్ణ, కైతేపల్లి దాస్, బుల్లా కిషోర్, పరిశే మౌళి, కోట పద్మావతి, కోడూరు వెంకటేశ్వరరావు, బీజేపీ మండల అధ్యక్షుడు రేవతి, పంచాయతీ ఈఓ పీవీ మాధవేంద్రరావు, శానిటరీ అధికారి కలతోటి సుధాకర్, బౌద్ధ ఉపాసకులు సీహెచ్.ఆది నారాయణ, వీఆర్ఓ గొల్లపూడి రాజేంద్ర, ధ్యాన మండలి ప్రతినిధులు మోహనరావు, నరసింహారావు, కిరణ్, అడపా గురవయ్య, గ్రామ ప్రముఖులు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొని యోగా చేశారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *