-డ్వామా పీడీ జె.సునీత ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వీయ, సమాజానికి యోగా ఇతివృత్తంతో జూన్ 21 శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా జిల్లాలో వ్యాప్తంగా యోగా ఔన్నత్యాన్ని చాటి చెప్పేందుకు పలు యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా యోగాసనాల ప్రయోజనాలు గురించి సామాన్య ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ జె.సునీత ఆధ్వర్యంలో విజయవాడ రూరల్ మండలం పరిధిలోని పాతపాడు సుబ్బన్న చెరువు వద్ద మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలు యోగాసనాలు అభ్యసించి వేడుకల్లో భాగస్వామ్యులను చేశారు. ఈ సందర్భంగా డ్వామా పీడీ సునీత మాట్లాడుతూ యోగా సాధనతో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్నీ పదిలంగా కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. ఉపాధి హామీ కూలీల శారీరక శ్రమకు యోగా, ధ్యానం తోడైతే శరీరాన్ని నడిపించే మానసిక ఆరోగ్యమూ శక్తిమంతమవుతుందన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మిషన్ అమృత్ సరోవర్ కింద అభివృద్ధి చేసిన 77 చెరువుల వద్ద యోగా దినోత్సవాన్ని నిర్వహించి కూలీలకు యోగాసనాల పై అవగాహన కల్పించడం జరిగిందని పి డి సునీత తెలిపారు.