రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
చివరి సాగు భూమి వరకూ సాగు నీరు అందేలా, వర్షాకాలం దృష్ట్యా వరద నివారణ చర్యలపై ముందస్తు కార్యాచరణ ప్రణాళిక , అత్యవసర పనులకు సంబంధించి నిర్వహణా కోసం అవసరమైన నిధుల వివరాలతో నివేదిక అందచేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్వహణ కోసం అవసరమైన నిధుల వివరాలతో నివేదిక అందచేయాలని పేర్కొన్నారు. ప్రస్తుత వర్షాకాలం దృష్ట్యా ప్రకృతి విపత్తులు, వరదలు వొచ్చే సందర్భంలో నష్ట నివారణ చర్యలు తీసుకోవడంలో ఇరిగేషన్ శాఖ పరంగా చేపట్టనున్న ప్రణాళిక లపై కలెక్టర్ చర్చించడం జరిగింది. జిల్లాలో ప్రస్తుతం నీటి లభ్యత, చివరి భూమి వరకూ సాగునీరు, ప్రజల త్రాగునీటి అవసరాలకు తగ్గట్టుగా స్టోరేజ్ వంటి వివరాలపై సమగ్ర సమాచారం అడిగి తెలుసుకున్నారు. డ్రెయిన్స్ కు సంబంధించిన నిర్వహణా వ్యవస్థ పై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులు వివరాలు తెలియ చేస్తూ, తూర్పు గోదావరి జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్వపు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నిర్వహణా పరిధిలో ఉన్నట్లు తెలియ చేశారు. జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులు సంబందించి అత్యవసర పనుల నిమిత్తం పుష్కర, చాగల్నాడు, వెంకట నగరం, తొర్రిగడ్డ పంపింగ్ స్కీం లకు అవసరమైన పనులు, అందుకు కావలసిన నిధుల వివరాలను ఇరిగేషన్ అధికారులు కలెక్టర్ కు వివరించారు. వీటిపై సమగ్ర నివేదిక అందచేయానున్నట్లు అధికారులు వివరించారు. ఈ సమావేశంలో తూర్పు గోదావరి జిల్లా ఇరిగేషన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ జి. శ్రీనివాస రావు, ఎస్ ఈ లు ఏసుబాబు, శ్యామ్ ప్రసాద్, దేవ ప్రకాష్, డి ఈ లు, ఏ ఈ లు తదితరులు పాల్గొన్నారు.