-జిల్లాలో 2,69,162 మందికి రూ.182.33 కోట్లు పెన్షన్ ల పంపిణీ
-హెచ్చించిన పెన్షన్ లను సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దకే పంపిణీ: జిల్లా కలెక్టర్ ధ్యాన చంద్ర
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఎన్ టి ఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ లను జిల్లాలో పండుగ వాతావరణంలో పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ధ్యాన చంద్ర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సామాజిక పెన్షన్ ల మొత్తాన్ని కేటగిరీల వారీగా పెంచి జూలై 1 న లబ్ధిదారుల ఇంటి వద్దకే పంపిణీ చేయలసినదిగా నిర్ణయించిందని అన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సామాజిక భద్రత పెన్షన్ ల పెంపు హామీ అమలులో మొదటి కేటగిరి లోని వృద్దాప్య, వితంతు, ఒంటరి మహిళ తదితర వర్గాల వారికి పెన్షన్ లను రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని ఇందులో 11 కేటగిరీలకు చెందిన వారి ఫించను సొమ్మును రూ.3 వేల నుండి రూ.4 వేలకు పెంచిన నేపథ్యంలో జూలై 1 వ తేదీన రూ.4 వేలతో పాటు ఏప్రిల్, మే మరియు జూన్ మాసాలకు సంబందించి పెరిగిన ఫించను సొమ్ము నెలకు రూ.1,000/- ల చొప్పున మూడు మాసాల అరియర్స్ కలుపుకుని మొత్తం రూ.7,000/-లను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. రెండవ కేటగిరీలోని పాక్షిక దివ్యాంగులకు రూ.3 వేల నుండి రూ.6 వేలకు, మూడో కేటగిరీలోని పూర్తి స్థాయి దివ్యాంగులకు రూ.5 వేల నుండి రూ.15 వేలకు మరియు నాలుగవ కేటగిరీలోని కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఝకాలిక వ్యాధులతో బాధపడేవారికి రూ.5 వేల నుండి 10 వేలకు పెంచిన ఫించను సొమ్ము పంపిణీ ఉంటుందన్నారు. జిల్లాలో మొత్తం 2,69,162 మందికి రూ.182.33 కోట్లు ఎన్టీఆర్ భరోసా – సామాజిక భద్రత పెన్షన్ ల కింద జూలై 1న పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.
జూలై 1 న ఉదయం 6.00 గంటల నుండి గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులతో ఫించనుదార్ల ఇంటి వద్దే ఫించను సొమ్మును పంపిణీ చేస్తామని, అవసరం మేరకు ఇతర శాఖ ఉద్యోగులను వినియోగించడం జరుగుతుందని, ఒక్కొక్క ఉద్యోగి ద్వారా 50 గృహాల చొప్పున ఫించన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. సాధ్యమైనంత మేర ఒకే రోజు ఈ ఫించన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుందని, అనివార్య కారణాల వల్ల ఇంకా ఎవరన్నా మిగిలిపోయి ఉంటే రెండో రోజు కూడా ఈ పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.