– పథకం ద్వారా జిల్లావ్యాప్తంగా పండగలా పెన్షన్ల పంపిణీ
– ఓ మంచి కార్యక్రమంలో భాగస్వాములు కావడం ఆనందంగా ఉంది
– శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్ డా. జి.సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేదలకు అండగా నిలిచేందుకు.. సమాజంలోని వివిధ వర్గాల సామాజిక భద్రత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఎన్‌టీఆర్ భరోసా పథకం కింద పెంచిన పెన్షన్ల మొత్తం పంపిణీ కార్యక్రమం సోమవారం జిల్లావ్యాప్తంగా పండగలా సాగింది. ఉదయం ఆరు గంటలకే కార్యక్రమం ప్రారంభం కాగా.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, ఇతర ఉద్యోగులు తమకు మ్యాపింగ్ చేసిన లబ్ధిదారులకు నగదును వారి ఇళ్లవద్దే అందించారు. జులై నెల పింఛను రూ. 4 వేలతో పాటు ఏప్రిల్, మే, జూన్‌లకు సంబంధించిన రూ. 3 వేల అరియర్స్‌తో కలుపుకొని వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితరులకు రూ. 7 వేలు చొప్పున అందించారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. జి.సృజనతో పాటు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్, తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు, నందిగామ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి), విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్‌రావు తమతమ నియోజకవర్గాల్లో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల జీవన ప్రమాణాలను పెంచాలనే ఉద్దేశంతో పెంచిన పెన్షన్ మొత్తాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పేదల అభ్యున్నతికి ఇంత మంచి కార్యక్రమాన్ని అమలుచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఓ మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం ఆనందాన్నిస్తోంది: కలెక్టర్ జి.సృజన
గౌరవ శాసనసభ్యులతో కలిసి కలెక్టర్ సృజన.. సోమవారం ఉదయం మైలవరం, విజయవాడ తూర్పు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాల పరిధిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. జక్కంపూడి కాలనీ, ఫకీర్ గూడెం, గిరిపురం ప్రాంతాల్లో లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ మొత్తాన్ని అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పెంచిన పెన్షన్ మొత్తాన్ని సరైన విధంగా లబ్ధిదారులకు అందించడం జరుగుతోందని.. ఇంతమంచి కార్యక్రమంలో భాగస్వామ్యం ఆనందాన్నిస్తోందని పేర్కొన్నారు. జిల్లాలో 2,35,477 మంది పెన్షన్‌దారులకు రూ. 160.53 కోట్ల మేర మొత్తాన్ని అందించే కార్యక్రమాన్ని ఉదయం ఆరు గంటలకే ప్రారంభించడం జరిగిందని.. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములైన గౌరవ ప్రజాప్రతినిధులు, ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా అధికార యంత్రాంగానికి అభినందనలు తెలియజేస్తున్నట్లు కలెక్టర్ సృజన పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.