– ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా 87 అర్జీలు
– ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చే అర్జీలను అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో పరిష్కరించడం ప్రధానమని కలెక్టర్ డా. జి.సృజన అన్నారు. సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సృజన.. డీఆర్‌వో వి.శ్రీనివాసరావు, జిల్లా పౌరసరఫరాల డీఎం జి.వెంకటేశ్వర్లు, కేఆర్ఆర్‌సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఇ.కిరణ్మయి, హౌసింగ్ పీడీ రజనీ కుమారితో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల వినతులను క్షుణ్నంగా పరిశీలించి నిర్దేశ గడువులోగా నాణ్యంగా పరిష్కారం చూపాలన్నారు. జిల్లాస్థాయి అధికారులు క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకొని అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని.. ఎప్పటికప్పుడు నాణ్యమైన సమీక్ష నిర్వహించడం ముఖ్యమన్నారు. వినతుల పరిష్కారంలో కచ్చితమైన సమాచారంతో కూడిన సమాధానాలను అందించాలని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 87 అర్జీలు అందగా.. వీటిలో రెవెన్యూ-29, ఎంఏయూడీ-17, పోలీస్-10, సర్వే అండ్ సెటిల్‌మెంట్-4, ఎడ్యుకేషన్-1, వ్యవసాయ మార్కెటింగ్-1, ఏపీఎస్‌డబ్ల్యూఆర్ఈఐఎస్-4, ఉపాధి-1, డీఆర్‌డీఏ-5, మైన్స్ అండ్ జియాలజీ-1, ఆరోగ్యం-1, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు-1, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్-1, పంచాయతీరాజ్-1, పౌర సరఫరాలు-2, గ్రామీణ నీటి సరఫరా-2, బీసీ సంక్షేమం-2, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం-1, ఏపీఎస్ఆర్‌టీసీ-1, రహదారులు, భవనాలు-1, సహకారం-1 అర్జీ ఉన్నాయన్నారు.
పర్యావరణ హిత జీవనశైలిని అలవరచుకోవాలి: కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. జి.సృజన.. అధికారులు, సిబ్బంది పర్యావరణ హిత జీవనశైలిని అలవరచుకోవాలని.. ప్లాస్టిక్ వినియోగానికి వీలైనంత దూరంగా ఉండాలని సూచించారు. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న మనం పర్యావరణ హిత విధానాలను అనుసరిస్తూ మరో పదిమందికి తెలియజేయాలని కలెక్టర్ సృజన సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, ఐసీడీఎస్ పీడీ జి.ఉమాదేవి, డ్వామా పీడీ జె.సునీత, డీఎస్‌వో జి.మోహన్ బాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.