– రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పకడ్బందీ చర్యలు
– రోజూ ఉదయం 6 గం. నుంచి సాయంత్రం 6 గం. వరకు సేవలందించనున్న స్టాక్‌యార్డులు
– ఒక వినియోగదారునికి రోజుకు గరిష్టంగా 20 మెట్రిక్ టన్నుల వరకు అనుమతి
– నిషేధిత కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
– ఉచిత ఇసుక విధానం అమలుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి
– జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విస్తృత ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఉచిత ఇసుక విధానాన్ని ఈ నెల 8వ తేదీ నుంచి జిల్లాలో అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో అమలుచేసేందుకు మైన్స్ అండ్ జియాలజీ, రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్, సెబ్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన ఆదేశించారు.
ఉచిత ఇసుక విధానంపై కలెక్టర్ సృజన.. మైన్స్ అండ్ జియాలజీ, రెవెన్యూ, పోలీస్, సెబ్, పంచాయతీరాజ్, ఇరిగేషన్, రవాణా, పొల్యూషన్ తదితర శాఖల అధికారులతో శనివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉచిత ఇసుక విధానాన్ని సజావుగా అమలుచేసేందుకు అవగాహన పెంపొందించుకోవాల్సిన అంశాలు, క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ రోజూ ఉదయం 6 గం. నుంచి సాయంత్రం 6 గం. వరకు
స్టాక్‌యార్డ్ పనిచేసేలా ఏర్పాట్లు చేయాలని… మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదికన వినియోగదారులకు ఇసుకను సరఫరా చేయాల్సి ఉంటుందన్నారు. వినియోగదారులే సొంతంగా వాహనాన్ని సమకూర్చుకోవాలన్నారు. ఇసుక తవ్వకం, లోడింగ్, స్టాక్‌యార్డ్‌కు రవాణా, ర్యాంపు నిర్వహణ, చట్టబద్ధ పన్నులు, లెవీలకు మాత్రమే నామమాత్రంగా వినియోగదారుల నుంచి వసూలు చేయడం జరుగుతుందని.. ఈ మొత్తంలో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఖజానాకు వెళ్లదని.. నేరుగా జిల్లా, మండల పరిషత్తులు, పంచాయతీలకు వెళ్తుందన్నారు. స్టాక్ యార్డుల్లో అందుబాటులో ఉన్న ఇసుక వివరాలు డీఎంజీ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. పర్యావరణ నియంత్రణలు, మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వాయర్లలో పూడిక రూపంలో ఉన్న ఇసుకను వెలికితీసేందుకు కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు.
స్టాక్ యార్డు వద్ద ధరలను ప్రదర్శించాలి
వీఆర్‌వో, వీఆర్ఏ; గ్రామ, వార్డు సచివాలయ అధికారులతో ప్రతి స్టాక్ యార్డ్‌కు ఇన్‌ఛార్జ్‌లను నియమించాలని కలెక్టర్ సృజన ఆదేశించారు. స్టాక్ పాయింట్ల వద్ద సరైన విధంగా సీసీ టీవీ కెమెరాల నిఘా ఉంచాలన్నారు. జిల్లాస్థాయి ఇసుక కమిటీ (డీఎల్ఎస్‌సీ) నిర్ణయించిన ధరలను యార్డుల వద్ద ప్రదర్శించాలని.. వినియోగదారుల నుంచి డిజిటల్ చెల్లింపులు మాత్రమే చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వినియోగదారునికి తప్పనిసరిగా పేమెంట్ రశీదు ఇవ్వాలని సూచించారు. ఒక వినియోగదారునికి రోజుకు గరిష్టంగా 20 మెట్రిక్ టన్నుల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని.. డిమాండ్, సరఫరాకు అనుగుణంగా ఈ పరిమితిపై డీఎల్ఎస్‌సీ ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటుందన్నారు. వినియోగదారుడు ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, ఇసుక డెలివరీ చిరునామా, వాహనం నంబరును ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆర్డర్ నదీ ప్రవాహాల నుంచి ఆయా గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రజలు సొంత అవసరాలకు, కమ్యూనిటీ పనులకు ఎడ్ల బండ్ల ద్వారా ఇసుకను తీసుకెళ్లొచ్చని.. అయితే యాంత్రిక పద్ధతుల్లో కాకుండా మాన్యువల్ పద్ధతుల్లో మాత్రమే వెలికితీయాలని వివరించారు.
నిషేధిత కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు
అవసరమైన దానికంటే ఎక్కువగా ఇసుకను నిల్వ ఉంచినా, ఇసుకను రీసేల్ చేసినా, ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా చేసినా, భవన నిర్మాణానికి కాకుండా ఫిల్లింగ్ లేదా ఇతర ప్రయోజనాలకు ఉపయోగించినా క్రిమినల్ కేసులు లేదా అధిక జరిమానాలు వంటి కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ సృజన హెచ్చరించారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై పోలీస్, సెబ్ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ గట్టి నిఘా ఉంచాలని ఆదేశించారు. టెలీకాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ పి.సంపత్ కుమార్, డీఆర్‌వో వి.శ్రీనివాసరావు, మైన్స్ అండ్ జియాలజీ డిప్యూటీ డైరెక్టర్ జి.వెంకటేశ్వర్లు, ఏడీ కె.వీరాస్వామి, విజయవాడ ఆర్‌డీవో బీహెచ్ భవానీ శంకర్, నందిగామ ఆర్‌డీవో ఎ.రవీంద్రరావు, తిరువూరు ఆర్‌డీవో కె.మాధవి, తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.