-జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 8వ తేదీ సోమవారం నుంచి ఉచిత ఇసుక విధానాన్ని పటిష్టంగా అమలుచేసేందుకు పూర్తి సన్నద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.సృజన తెలిపారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్.. ఉచిత ఇసుక విధానం అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీకి జిల్లా కలెక్టర్ సృజన.. అధికారులతో కలిసి కలెక్టరేట్ నుంచి హాజరయ్యారు. ఉచిత ఇసుక విధానాన్ని సజావుగా అమలుచేసేందుకు క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన.. జిల్లాస్థాయి సన్నద్ధతను వివరిస్తూ.. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఉచిత ఇసుక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పటిష్ట ప్రణాళికతో అమలుచేసేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లాలో పెండ్యాల స్టాక్‌యార్డులో 29,672 మెట్రిక్ టన్నులు, మాగళ్లులో 54,549 మెట్రిక్ టన్నులు, కొడవటికల్లులో 14,570 మెట్రిక్ టన్నులు, అల్లూరుపాడులో 4,560, అనుమంచిపల్లిలో 85,230 మెట్రిక్ టన్నులు, పోలంపల్లిలో 1,383 మెట్రిక్ టన్నులు, కీసరలో 2,24,555 మెట్రిక్ టన్నులు, మోగులూరు స్టాక్‌యార్డులో 1,39,865 మెట్రిక్ టన్నుల మేర ఇసుక అందుబాటులో ఉన్నట్లు వివరించారు. ఉచిత ఇసుక విధానం అమలుకు సంబంధించి ఇప్పటికే జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు. క్షేత్రస్థాయి అధికారులకు విధివిధానాలపై సూచనలు ఇచ్చినట్లు వెల్లడించారు. మైన్స్ అండ్ జియాలజీ, రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్, సెబ్ తదితర శాఖల సమన్వయం, అవసరమైన మానవ వనరుల నియామకం, సీసీటీవీల నిఘా తదితర అంశాలను వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మైన్స్ అండ్ జియాలజీ డిప్యూటీ డైరెక్టర్ జి.వెంకటేశ్వర్లు, ఏడీ కె.వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.