– బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటాం
– ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశాలిచ్చాం
– ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగ్గయ్యపేట మండలం, బూదవాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని.. ప్రత్యేక వైద్య బృందాలు ఇందుకోసం కృషిచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఎస్.సృజన తెలిపారు. తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రి, గొల్లపూడి ఆంధ్రా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కలెక్టర్ సృజన పరామర్శించారు. ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఆంధ్రా హాస్పిటల్‌లో 8 మంది, మణిపాల్ ఆసుపత్రిలో 8 మంది చికిత్స పొందుతున్నారని.. 16 మందిలో అయిదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. ప్రత్యేక వైద్య బృందాలతో మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన వారి బంధువులతోనూ మాట్లాడారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవడం జరుగుతుందని భరోసా కల్పించారు. ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. నివేదికలను అనుసరించి బాధ్యులపై చట్టపర చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో 8 మంది ఎన్‌టీఆర్ జిల్లాకు చెందిన వారుకాగా.. పల్నాడు జిల్లాకు చెందిన వారు ఒకరు ఉన్నారన్నారు. అయిదు మంది ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వారు కాగా, ఒకరు జార్ఖండ్, మరొకరు బీహార్ చెందిన వారు ఉన్నట్లు వివరించారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని తదితరులు ఉన్నారు.