-మొదటిసారి రూ. 1.5 లక్షల కోట్లు దాటిన ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల టర్నోవర్
-2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక గణాంకాలను విడుదల చేసిన కెవిఐసి
-గత 10 సంవత్సరాలతో పోలిస్తే ఉత్పత్తిలో 315% మరియు అమ్మకాలలో 400% పెరుగుదల
-10 సంవత్సరాలలో కొత్త ఉపాధి కల్పనలో చారిత్రకంగా 81% పెరుగుదల
-ఖాదీ గ్రామోద్యోగ్ భవన్ న్యూఢిల్లీలో పదేళ్లలో 87.23% వృద్ధి
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కెవిఐసి), సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ, 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి, విక్రయాలు మరియు నూతన ఉపాధి కల్పనలో కొత్త రికార్డును నెలకొల్పింది.
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక గణాంకాలను ఈరోజు విడుదల చేసిన కెవిఐసి ఛైర్మన్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ- గత గణాంకాలన్నింటినీ అధిగమించి, విక్రయాలలో 399.69 శాతం (సుమారు 400%), ఉత్పత్తిలో 314.79 శాతం (సుమారు 315%) పెరుగుదల నమోదైంది అని చెప్పారు. అలాగే 2013-14 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఉత్పత్తిలో, మరియు కొత్త ఉపాధి కల్పనలో 80.96 శాతం (సుమారు 81%) వృద్ధి కనిపించిందని అన్నారు. 2013-14తో పోలిస్తే, 2022-23 ఆర్థిక సంవత్సరంలో విక్రయాలలో 332.14%, ఉత్పత్తిలో 267.52% మరియు కొత్త ఉపాధి కల్పనలో 69.75% పెరుగుదల ఉంది.
కెవిఐసి యొక్క ఈ అద్భుతమైన పనితీరు 2047 నాటికి ‘అభివృద్ధి చెందిన భారతదేశం’ యొక్క దృక్పథాన్ని సాకారం చేయడంలో మరియు భారతదేశాన్ని ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో గణనీయంగా కృషి చేసిందని కుమార్ అన్నారు. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా కేవీఐసీ ఉత్పత్తుల విక్రయాలు 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.55 లక్షల కోట్లు దాటింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ అమ్మకాల మొత్తం రూ. 1.34 లక్షల కోట్లు. ‘మోదీ ప్రభుత్వం’ హయాంలో గత పది ఆర్థిక సంవత్సరాల్లో గ్రామీణ ప్రాంతాల్లోని చేతివృత్తుల వారు తయారు చేసిన దేశీయ ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమ ఉత్పత్తుల విక్రయాలు 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ. 31154.20 కోట్లు కాగా; ఆ మొత్తం 2023-24 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ. 155673.12 కోట్లుగా నమోదు అయింది. ఇది ఇప్పటివరకు సాధించిన గొప్ప విజయం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో, కెవిఐసి యొక్క ప్రయత్నాలు గ్రామీణ ప్రాంతాలలో 10.17 లక్షల కొత్త ఉద్యోగాలను సైతం సృష్టించాయి. తద్వారా గ్రామీణ భారతదేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసింది.
బాపు స్ఫూర్తి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హామీ, దేశంలోని మారుమూల గ్రామాల్లో పనిచేస్తున్న కోట్లాది మంది కళాకారుల అవిశ్రాంత ప్రయత్నాలే ఈ చారిత్రాత్మక విజయానికి కారణమని కెవిఐసి చైర్మన్ పేర్కొన్నారు. ఖాదీకి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆమోదముద్ర వేయడం వల్ల ఖాదీ ఉత్పత్తులపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని ఆయన అన్నారు. ఖాదీ యువతకు, ఫ్యాషన్‌కి ‘న్యూ స్టేటస్ సింబల్’గా మారింది. ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమ ఉత్పత్తులకు డిమాండ్ మార్కెట్లో వేగంగా పెరుగుతోంది. ఇది ఉత్పత్తి, అమ్మకాలు మరియు ఉపాధి గణాంకాలలో ప్రతిబింబిస్తుంది. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తిని పెంచేందుకు గత పదేళ్లలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో పెను మార్పులు, నిర్ణయాలు తీసుకున్నామని; ఇవి సానుకూల ఫలితాలను ఇస్తున్నాయన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘వోకల్ ఫర్ లోకల్’, ‘స్వదేశీ ఉత్పత్తులపై’ దేశ ప్రజల విశ్వాసం పెరిగిందనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని ఆయన అన్నారు.
ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమ ఉత్పత్తుల ఉత్పత్తి 2013-14 ఆర్థిక సంవత్సరంలోరూ. 26,109.08 కోట్లు కాగా; 2023-24 ఆర్థిక సంవత్సరంలో అది రూ. 108,297.68 కోట్లకు చేరింది. అంటే సుమారుగా 314.79 శాతం పెరుగుదల నమోదు అయింది. అలాగే 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి రూ. 95956.67 కోట్లుగా నమోదైంది. ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల కమీషన్ గ్రామీణ ప్రాంతాల్లో చారిత్రాత్మకమైన పని చేసిందనడానికి నిరంతరంగా వృద్ధి చెందుతున్నఈ ఉత్పత్తి పెరుగుదలే నిదర్శనం.
గత 10 ఆర్థిక సంవత్సరాల్లో, ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమ ఉత్పత్తులు ప్రతి సంవత్సరం కొత్త విక్రయ రికార్డులను సృష్టించాయి. అమ్మకాలు 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ. 31,154.20 కోట్లు, అవి 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,55,673.12 కోట్లుగా నమోదు అయ్యాయి. అంటే 399.69 శాతం పెరుగుదలతో అద్భుతంగా, అత్యధిక విక్రయాలు జరిపింది.
గత పదేళ్లలో ఖాదీ బట్టల ఉత్పత్తిలో అనూహ్యమైన పెరుగుదల కూడా ఉంది. కాగా ఖాదీ బట్టల ఉత్పత్తి 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ. 811.08 కోట్లు కాగా; 2023-24 ఆర్థిక సంవత్సరంలో అది 295.28 శాతం పెరుగుదల నమోదు చేసి రూ. 3,206 కోట్లకు చేరుకుంది. ఇది ఇప్పటివరకు ప్రదర్శితమైన అత్యుత్తమ పనితీరు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఖాదీ బట్టల ఉత్పత్తి రూ. 2915.83 కోట్లు.
గత పది ఆర్థిక సంవత్సరాల్లో ఖాదీ వస్త్రాలకు డిమాండ్ కూడా చాలా వేగంగా పెరిగింది. దీని విక్రయాలు 2013-14 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ. 1,081.04 కోట్లు కాగా; 2023-24 ఆర్థిక సంవత్సరంలో అది 500.90 శాతం పెరుగుదలతో రూ. 6,496 కోట్లకు అది చేరింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 5,942.93 కోట్ల విలువైన ఖాదీ బట్టల అమ్మకాలు జరిగాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఖాదీని పెద్ద పెద్ద వేదికల నుండి ప్రచారం చేయడం అనేది ఖాదీ బట్టల అమ్మకాల పై విస్తృత ప్రభావం చూపింది. గతేడాది దేశంలో జరిగిన జీ-20 సదస్సు సందర్భంగా ప్రధాని ఖాదీని ప్రమోట్ చేసిన తీరు ప్రపంచ దేశాలను ఖాదీ వైపు ఆకర్షించింది.
ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమీషన్ యొక్క ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతాల్లో గరిష్టంగా ఉపాధి అవకాశాలను కల్పించడం. గత పదేళ్లలో కేవీఐసీ కూడా ఈ విషయంలోనూ రికార్డు సృష్టించింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో సంచిత ఉపాధి 1.30 కోట్లు కాగా, 2023-24లో 43.65 శాతం వృద్ధితో అది 1.87 కోట్లకు చేరుకుంది. అదేవిధంగా 2013-14 ఆర్థిక సంవత్సరంలో 5.62 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 80.96 శాతం వృద్ధితో 10.17 లక్షలకు చేరుకుంది. ఖాదీ బట్టల తయారీలో 4.98 లక్షల మంది గ్రామీణ ఖాదీ కళాకారులు (స్పిన్నర్లు మరియు నేత కార్మికులు) మరియు కార్మికులు కూడా పనిచేస్తున్నారు.
న్యూఢిల్లీలోని ఖాదీ మరియు గ్రామోద్యోగ్ భవన్ వ్యాపారం కూడా గత పదేళ్లలో అపూర్వమైన వృద్ధిని సాధించింది. ఇక్కడ వ్యాపారం 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ. 51.13 కోట్లు కాగా, అది 87.23 శాతం పెరిగి 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 95.74 కోట్లకు చేరింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఖాదీ గ్రామోద్యోగ్ భవన్ న్యూఢిల్లీ వ్యాపార విలువ రూ. 83.13 కోట్లు.