– ప్రభుత్వ సహకారంతో బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
– రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్
జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త :
జగ్గయ్యపేట మండలం, బూదవాడలోని అల్ట్రాటెక్ సిమెంటు ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన బాణావత్ స్వామి మృతదేహానికి నివాళులు అర్పించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ మీడియాతో మాట్లాడారు. అల్ట్రాటెక్ సిమెంటు ఫ్యాక్టరీ ప్రమాదంలో 16 మందికి తీవ్రగాయాలుకాగా, ఇప్పటికే ఇద్దరు చనిపోయారని తెలిపారు. గాయపడిన వారిలో ముగ్గురు గిరిజనులు ఉండగా వీరిలో బాణావత్ స్వామి నాయక్ గురువారం చనిపోవడం చాలా బాధకలిగిస్తోందన్నారు. ప్రభుత్వం, ఎస్టీ కమిషన్, అధికార యంత్రాంగం, గిరిజన పెద్దలు.. ఇలా అందరూ బాధిత కుటుంబాలకు బాసటగా నిలుస్తున్నట్లు తెలిపారు. చనిపోయిన స్వామి నాయక్ కుటుంబానికి అల్ట్రాటెక్ ఫ్యాక్టరీ, ప్రభుత్వం తరఫున, అధికార యంత్రాంగం తరఫున రూ. 50 లక్షల చెక్కును అందించడం జరిగిందన్నారు. ఈ ప్రాంత ప్రజలు అంతా ఇక్కడి పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తున్నట్లు తెలుస్తోందని.. ఈ ప్రాంతంలో పుట్టిన తమకు సరైన ఉద్యోగాలు రావడం లేదని.. వచ్చినా సరైన వేతనాలు రావడం లేదని వందలాది యువత ఆవేదన వెలిబుచ్చుతున్న పరిస్థితి కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో గిరిజనుల సంక్షేమం లక్ష్యంగా ఎస్టీ కమిషన్ పనిచేస్తోందని… ప్రభుత్వ మద్దతుతో అధికార యంత్రాంగం సహకారంతో బాధిత కుటుంబాలకు పూరిస్థాయిలో న్యాయం చేయడానికి కృషిచేస్తామని తెలిపారు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయి ఎంతో బాధపడుతున్న కుటుంబం ఆవేదనను అర్థం చేసుకొని భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు.