Breaking News

ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపగలిగే సంస్థ సీఐఐ

-సీఐఐ ప్రతినిధులతో వర్చువల్ గా సమావేశమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
-P4 విధానంలో భాగస్వాములు అవ్వాలని సీఐఐ ప్రతినిధులకు విజ్ఞప్తి
-ఈ ఏడాది మరోసారి విశాఖలో సీఐఐ భేటీ
-ఫిన్ టెక్ హబ్ గా విశాఖను తీర్చిదిద్దుతామని స్పష్టం
-పేదరికం లేని సమాజం తన లక్ష్యం అని వెల్లడి
-స్కిల్ గణన ద్వారా యువతకు నైపుణ్యాలు అందిస్తాం.. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు..
-సంస్కరణలు రాజకీయం గా నష్టం చేసినా ప్రజలకు మంచి చేస్తాయని వెల్లడి
-రాష్ట్రాన్ని పునర్నించే క్రమంలో పరిశ్రమలకు మెరుగైన రాయితీలు కల్పిస్తామని భరోసా

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో సీఐఐ ప్రతినిధులతో గురువారం వర్చువల్ గా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని వనరులు, అవకాశాల గురించి వివరిస్తూ సీఐఐ ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని అందుకు ప్రభుత్వం తరపున అవసరమైన సాయం చేస్తామని వెల్లడించారు. రాష్ట్రాన్ని పునర్నించే క్రమంలో పరిశ్రమలకు మెరుగైన రాయితీలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. పేదరికం లేని సమాజ స్థాపనకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. సంస్కరణలు రాజకీయంగా నష్టం చేకూర్చినా ప్రజలకు మంచి చేస్తాయని కొన్ని ఘటనలను కూలంకషంగా సీఐఐ ప్రతినిధులకు వివరించారు.

ఈ సందర్భంగా సీఐఐ ప్రతినిధులతో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే..
మిమ్మల్ని ఇలా కలుసుకోవడం సంతోషంగా ఉంది. నేను నాలుగో సారి ముఖ్యమంత్రిగా ఉన్నాను. 1995లో తొలిసారిగా నేను ముఖ్యమంత్రి అయినప్పుడు సీఐఐ చిన్న సంస్థగా ఉండేది. ఇప్పుడు అదే సీఐఐ పెద్ద సంస్థ. ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపగలిగే సంస్థ. అప్పట్లో ప్రతి ఏడాది సీఐఐ కాన్ఫరెన్స్ నిర్వహించేవాళ్లం. అప్పుడు కనీస మౌలిక సదుపాయాలు కూడా లేని పరిస్థితిలో షెడ్డుల్లో, హోటల్ లో కాన్ఫరెన్స్ నిర్వహించుకునే దుస్థితి. ప్రస్తుత పరిస్థితి చూస్తే సేవా రంగం, పబ్లిక్ గవర్నెన్స్, ప్రైవేట్ గవర్నెన్స్, కార్పొరేట్ గవర్నెన్స్ తో సహా ప్రతి రంగంలో ప్రపంచవ్యాప్తంగా భారతీయులు రాణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ భారతీయులను నమ్ముతారు. ఇదొక శుభ పరిణామం. మన భారతీయులు సైతం ఏ ప్రాంతం వారితోనైనా, ఏ ప్రాంతంతో అయినా ఇమడగలరు. అది మనకున్న అదనపు వనరు. ప్రపంచవ్యాప్తంగా వెల్త్ క్రియేషన్, సేవా రంగంలో భారతీయులు నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు. ప్రపంచంలో ఇండియా నెంబర్ 1 లేదా నెంబర్ 2 స్థానంలో ఉండనుంది.

విద్యుత్ సంస్కరణలకు కేరాఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్
1998లోనే తొలిసారి విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చింది ఆంధ్రప్రదేశ్. ప్రధానంగా ట్రాన్స్ మిషన్, జనరేషన్, సంస్థలకు పంపిణీ. దేశంలోనే తొలిసారిగా రెగ్యులేటరీ కమిషన్ తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశే. ఓపెన్ స్కై పాలసీ ద్వారా హైదరాబాద్ నుంచి దుబాయ్ కి ఫస్ట్ ఎమిరేట్ ఫ్లైట్ తీసుకొచ్చాం. అదే సమయంలో తొలిసారి హైదరాబాద్ లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి నాంది పలికాం. ఆ తర్వాతే బెంగుళూరు, ముంబయి మొదలైనవి చేపట్టాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కు ప్రైవేట్ సంస్థల రూపంలో జీవీకే సంస్థ వచ్చింది. ఆ సమయంలో టెలికమ్యూనికేషన్ రంగంలో కేవలం విఎస్ఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్ ఉండేవి. నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ గారితో మాట్లాడి వాటి సేవలను రాష్ట్రానికి తీసుకొచ్చాను. రోడ్ సెక్టార్ లో సైతం నెల్లూరు- చెన్నై రహదారికి నాంది పలికాం. ఆ తర్వాత దేశవ్యాప్తంగా వాటి సేవలు వినియోగించుకున్నారు.

పేదరిక నిర్మూలనకు కృషి చేద్దాం
పబ్లిక్ పాలసీలను నేను బలంగా విశ్వసిస్తాను. ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. సంక్షేమం అనేది పేదరికాన్ని పారద్రోలే విధంగా ఉండాలి. ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలి. పేదరికం పోగొట్టేందుకు మనం ఏదైనా చేద్దాం. ఆర్థిక సంస్కరణల తర్వాత ఈరోజు మీ సమక్షంలో పబ్లిక్, ప్రైవేట్ పీపుల్స్ పార్ట్ నర్ షిప్ (పీ4) పాలసీని ప్రవేశపెట్టబోతున్నాను. అందరూ బాగా పని చేస్తున్నారు. పీపుల్ అంటే కేపిటల్ అని, ఇతర అంశాలన్నీ కేపిటల్ కు అదనం.

షార్ట్, మీడియం, లాంగ్ టర్మ్ ప్రణాళికలున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తే బాగుంటుందో మీరు చెప్పాలి. మీరు మాకు మార్గదర్శకత్వం అందించండి. అవకాశాలు సృష్టించుకొని ముందుకెళ్దాం. పేదరికం లేని దేశాన్ని ఎలా నిర్మించాలనే దాని గురించి ఆలోచిద్దాం. జీరో పావర్టీ స్టేట్, జీరో పావర్టీ విలేజ్, జీరో పావర్టీ లోకాలిటీ మన లక్ష్యం కావాలి.

ఆర్థికంగా దేశం నంబర్ వన్ గా ఉన్నప్పుడు పేదరికంలో ప్రజలు మగ్గుతుండటం దేశానికి మంచిది కాదు. పేదరికం లేని సమాజ స్థాపనకు మీ ఆలోచనలు కావాలి. మీ మార్గదర్శకత్వం కావాలి. మీ గైడెన్స్ లో ముందుకెళ్తాం.అంతిమంగా పేదరికం లేని సమాజం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. ఆరోజు కోసం అందరం కలిసి పనిచేద్దాం. క్షేత్రస్థాయిలో సమీక్షిద్దాం. అధునాతన సాంకేతికతను వినియోగించుకొని క్షేత్రస్థాయి నుంచే ప్రణాళికలు రచించి ముందుకు పోదాం.

ఏ దేశానికి లేని ఆధార్ అనే వ్యవస్థ మనకు ఉంది. ప్రస్తుతం మీరు డిజిటల్ కరెన్సీని చూస్తున్నారు. డిజిటల్ కరెన్సీ వినియోగం ( ట్రాన్సాక్షన్స్)లో మనం నెంబర్ 1లో ఉన్నాం. డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టి ముందుకు పోదాం అని చాలా రోజుల క్రితమే ప్రధానితో చర్చించాను.

సీఐఐ సభ్యుల ప్రశ్నలకు సమాధానాలిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
వ్యవసాయ రంగం అనేది చాలా ముఖ్యమైన అంశం. అధిక శాతం ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అధునాతన వ్యవసాయ పద్ధతులను, డ్రోన్ సాంకేతికతను వినియోగించుకొని పూర్తిస్థాయిలో ప్రగతిని సాధించలేకపోతున్నారు. ఈ అంశంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఆక్వా కల్చర్, హార్టికల్చర్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ కి మంచి పేరుంది. ఫార్మా ప్రొడక్షన్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలతో వీటిని అనుసంధానం చేయాలి. వీటి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి పలు కార్యక్రమాలు అమలు చేస్తోంది. సులభతర వ్యవసాయం అనేది నా విధానం. ఇతర పరిశ్రమలు, రంగాలతో పోలిస్తే వ్యవసాయ రంగం అనేక సంక్షోభాలను ఎదుర్కొంటోంది. నా దృష్టంతా వ్యవసాయ రంగం అభివృద్ధి పైనే. మీకు ఆసక్తి ఉంటే కలిసి పనిచేద్దాం. ప్రగతి సాధిద్దాం.

మేం స్కిల్ గణన, ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలపై దృష్టి పెట్టాం. రాష్ట్ర యువతకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. తద్వారా వారు ఆర్థికంగా స్థిరపడే అవకాశాలను కల్పిస్తాం. అందుకోసం రాష్ట్రంలో స్కిల్ గణన చేపట్టాం.

రాష్ట్రంలో విశాలమైన సముద్ర తీరం ఉంది. సమర్థవంతమైన మౌలిక సదుపాయాలు, అవసరమైన మానవ వనరులున్నాయి. మా రాష్ట్రంలో ఆటోమొబైల్, హార్డ్ వేర్ మాన్యుఫ్యాక్చరింగ్, ఫార్మా, అగ్రోప్రాసెసింగ్, తిరుపతిలోని ఎలక్ట్రానిక్స్ సిటిలో మంచి అవకాశాలున్నాయి. రాష్ట్రానికి దగ్గర్లో బెంగుళూరు ఎయిర్ పోర్ట్ ఉంది. గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్ అమలు చేసే ఆలోచన ఉంది. రాబోయే 4,5 నెలల్లో సోలార్, విండ్ , పంప్డ్ ఎనర్జీ అమలు చేసే తొలి కార్యక్రమం చేపట్టబోతున్నాం.

మా రాష్ట్ర సామర్థ్యాలు పరిశీలించి పారిశ్రామికవేత్తలు మంచి ఆలోచనలతో వస్తే కలిసి పనిచేద్దాం. మీరు ఆలోచనలతో వస్తే మేం అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.

గతంలో మేం విశాఖపట్నాన్ని ఫిన్ టెక్ హబ్ గా తీర్చిదిద్దాం. లండన్, సింగపూర్ ను మోడల్ గా తీసుకొని విశాఖను ఫిన్ టెక్ హబ్ గా మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతాం. మీకెలాంటి రాయితీలు ఇవ్వాలన్న అంశంపై ఆలోచిస్తాం. పరిశ్రమలకు మెరుగైన అవకాశాలు కల్పిస్తాం. 9 ఏళ్ల కాలంలో హైదరాబాద్ లో అత్యుత్తమ ఎకో సిస్టంను రూపొందించాం. విజయం సాధించాం. ప్రస్తుతం హైదరాబాద్ అనే ప్రాంతం లాజిస్టిక్ హబ్, నాలెడ్జ్ ఎకానమీ(ఐటీ, బయోటెక్నాలజీ, ఫైనాన్స్, ఫార్మా) కి ఒక మోడల్ గా తయారైంది. ఆంధ్రప్రదేశ్ గత ఐదేళ్లలో అభివృద్ధికి నోచుకోలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధిచెందేందుకు అన్ని రకాల వనరులు, అవకాశాలు ఉన్నాయి. మినరల్ వెల్త్, వ్యవసాయ రంగ భూములు ఉన్నాయి. మంచి మనస్తత్వం గల ప్రజలు ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా పనిచేయగలిగిన, చేస్తున్న సత్తా ఉంది. ప్రపంచంలో పనిచేస్తున్న భారతీయుల్లో తెలుగువారు తప్పక ఉంటారు. కొత్త ఆలోచనలతో రాష్ట్రానికి వస్తే కలిసి పనిచేద్దాం.

మళ్లీ మనమంతా ఈ సంవత్సంలోనే కలుద్దాం. వాయిదా వేయం. ఏదైనా మేం సకాలంలో చేస్తాం. తర్వాతి మీటింగ్ ఈ ఏడాదే డైనమిక్ సిటీ అయిన విశాఖపట్నంలోనే ఉంటుంది. ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్క నేషనల్ కౌన్సిల్ మెంబర్ ను ఆహ్వానిస్తున్నాను. మాకు పార్లమెంట్, అసెంబ్లీల్లో అత్యధిక మెజార్టీ లభించింది. విశాఖపట్నంలో ఒక చోట 95 వేలు, మరో చోట 94 వేలు మెజార్టీ సాధించాం. పార్లమెంట్ లో 5 లక్షలకు పైగా మెజార్టీ సాధించాం.

ప్రపంచవ్యాప్తంగా అందరూ భారతదేశం వైపు చూస్తున్నారు. మాకు మూడు అడ్వాంటేజెస్ ఉన్నాయని నమ్ముతున్నాం. మొదటిది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాకు సాటి లేదు. నాలెడ్జ్ ఎకానమీకి ఇదొక వెన్నముకలాంటిది. రెండోది డెమోగ్రఫిక్ డివిడెంట్. మూడోది ఎంటర్ ప్రెన్యూర్ స్కిల్ గల యువత. ప్రపంచంలోని ఏ దేశంతో అయినా పోల్చి చూడండి మా యువత సత్తా తెలుస్తుంది.

చైనా, యూరోప్,జపాన్ లాంటి దేశాల్లో వృద్ధాప్య జనాభా అతి పెద్ద సమస్యగా ఉంది. అదే క్రమంలో జనాభా క్రమక్రమంగా తగ్గుతోంది. భారతదేశమే ప్రతి ఒక్కరికి భవిష్యత్ అందించే గొప్ప దేశంగా కనబడుతోంది.

మానవ వనరులను దృష్టిలో ఉంచుకొని భారతదేశానికి అత్యధిక స్థాయిలో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. మీరు కూడా మా అమరావతి పెట్టుబడులతో రండి. మీ సంస్థల ప్రధాన కార్యాలయాలు ఇక్కడ నెలకొల్పండి. మీకు భూములిచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. 3 దశాబ్ధాలుగా మీతో కలిసి పనిచేస్తున్నాం. ఇప్పుడు మీరు మాకు సాయం చేయండి. నాలెడ్జ్ ఎకానమీ, పబ్లిక్ పాలసీ క్రియేషన్ హబ్ గా అమరావతి మారనుంది. అమరావతి భవిష్యత్ నగరంగా రూపుదిద్దుకోబోతుంది. త్వరలో అమరావతిని మేం అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దుతాం.

అమరావతిలో డేటా అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేద్దాం. ప్రస్తుతం మా దగ్గరున్న డేటా సమగ్రంగా లేదు. ముందస్తుగా మనం ఏ ఒక్కరూ ప్రశ్నించలేని డేటాను సమకూర్చుకోవాలి. మీరు వినూత్న ప్రతిపాదనలతో రండి. అందుకు తగ్గ వసతులను మేం కల్పిస్తాం.

నేను ఏ విషయాన్నైనా ముందుగానే అంచనా వేసి అమలు చేస్తాను. 1998లో అమలు చేసిన విద్యుత్ రంగ సంస్కరణల వల్ల నాకు ఎదురుదెబ్బ తగిలినప్పటికీ ఆ సంస్కరణల ఫలితంగానే హైదరాబాద్ విశ్వ నగరంగా నేడు సగర్వంగా నిలబడింది. అది నాకు మంచి పేరుతో పాటు సంతృప్తినిచ్చింది.

1995లో నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని పరిచయం చేశాను. తద్వారా అధిక సంఖ్యలో ఇంజినీరింగ్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. లక్షలాది మంది ఇంజినీరింగ్ విద్యార్థులు వచ్చారు. ఆరోజున నేను అందరికీ ఒకే మాట చెప్పాను .. ఉద్యోగాల కోసం కాదు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని సూచించాను.

ఇటీవల నన్ను అరెస్ట్ చేసినప్పుడు 80 దేశాల్లో 53 రోజుల పాటు నిరసనలు వ్యక్తం అయ్యాయి. నేను నిజాయితీగా ఉన్నానని వారికి తెలుసు. నా వల్లే వాళ్లంతా ఇతర దేశాల్లో స్థిర పడ్డారని నమ్ముతున్నారు. అది నాకు చాలా సంతృప్తినిచ్చిన అంశం. మనం పట్టుదలతో కష్టపడి పనిచేస్తే మంచి ఫలితం ఎప్పటికైనా వస్తుందని నమ్మే వ్యక్తిని నేను.

4వ సారి నేను ముఖ్యమంత్రిగా అయిన సందర్భం చారిత్రాత్మక విజయంతో కూడుకున్నది. మనం చేసిన మంచి పనులకు ఫలితాలు సత్వరం రానప్పటికీ తప్పకుండా ఏదో ఒక రోజు వస్తాయనడానికి ఈ చారిత్రాత్మక విజయమే నిదర్శనం.

పీ4 మోడల్ లో మీరంతా మాకు సహాయం చేయాలని కోరుతున్నాను. కొంత మేర ఇబ్బందికరమైనా ఇది సాధ్యమే. పేదరిక నిర్మూలనలో మన వంతు పాత్ర పోషిద్దాం. దశాబ్ధాలుగా రిజర్వేషన్లు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ పేదరికం ఇప్పటికీ వేళ్లూనుకుపోయింది. ప్రభుత్వాలు, ప్రైవేట్ వ్యక్తులు కలిసి వినూత్నమైన ఆలోచనలతో ప్రయత్నిస్తే పేదరిక నిర్మూలన సాధ్యమని నేను నమ్ముతున్నాను. అమరావతిలో నిర్మించాల్సిన సీఐఐ యూనివర్సిటీ గత విధానాల కారణంగా ముంబయికి తరలిందని, యూనివర్సిటీ సెంటర్ ని అమరావతిలో నిర్మించేందుకు తోడ్పాటు అందించాలన్న సీఐఐ ప్రతినిధుల ప్రతిపాదన మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. మీరు సీఐఐ 2వ యూనివర్సిటీని అమరావతిలో ప్రారంభించండి. మేం అందుకు అవసరమైన భూమిని కేటాయిస్తాం. మంచి ఆలోచనతో రండి అమలు చేసేందుకు మేం సంసిద్ధంగా ఉన్నాం. అమరావతిని అద్భుతమైన నగరంగా నిర్మించేందుకు అందరి తోడ్పాటు అవసరం.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *