అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మంగళగిరి ఎపిఐఐసి టవర్స్ లోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో ప్రచార పోస్టర్లను గురువారం ఆ శాఖ స్పెషల్ సియస్ ఎం.టి.కృష్ణబాబు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రాల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గత కొన్నేళ్లుగా ఏపీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల వల్ల ఫల్టిలిటీ రేట్ 1.5కు వచ్చింది. దీని వల్ల జనాభా పెరుగుదల లేకుండా స్థిరీకరణ సాధ్యమవుతోంది. ఇది శుభ పరిణామం. అయితే సవాళ్లు కూడా లేకపోలేదు. ప్రధానంగా 18 ఏళ్లలోపు యువతులు పెళ్లి చేసుకుని గర్భాన్ని దాల్చడం, బిడ్డకూ బిడ్డకూ మధ్య గర్భం దాల్చే కాలం తక్కువగా ఉండడం వంటి అంశాలపై మరింత దృష్టిని సారిస్తే మాతృ, శిశు మరణాల శాతాన్ని తగ్గించొచ్చు. 18 ఏళ్ల లోపు వివాహాలు చేసుకునే యువతుల విషయంపైనా , బిడ్డకూ బిడ్డకూ మధ్య గ్యాప్ ఇవ్వడంపైనా పెద్ద ఎత్తున గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలి. స్థానిక సర్పంచ్, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, స్థానిక నాయకుల సహకారం తీసుకోవాలి. తద్వారా మాతృ మరణాల్ని 30 శాతం మేర, శిశు మరణాల్ని 10 శాతం మేర తగ్గించొచ్చు. గర్భిణులు ఇతర సమస్యలకు గురికాకుండా సుఖ ప్రసవాలయ్యేలా ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా మూడు నెలలకోసారి ఇంజక్షన్లు ఇస్తున్నాం. 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్య సాధన(Sustainable Development Goals) దిశగా ఏపీ ఉత్తమ ప్రతిభను కనబర్చి దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు గాను వైద్య ఆరోగ్య శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఏపీలో ఏడాదికి 8 లక్షల దాకా ప్రసవాలు జరుగుతున్నాయి. వీరందరికీ రక్తహీనత పరీక్షలతో పాటు ఇతర పరీక్షలన్నీ నిర్వహిస్తున్నాం. పుట్టిన వెంటనే అలాగే నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకూ ప్రత్యేకమైన సేవలందించేందుకు గాను ప్రభుత్వాసుపత్రుల్లో ఎస్ఎన్‌సియులు, ఎన్ ఐసియులు ఏర్పాటు చేశాం. అలాగే హైరిస్క్ గర్భిణులకు హిమోగ్లోబిన్ పరీక్షలతో పాటు ముందస్తు పరీక్షలన్నీ చేపడుతున్నాం. హైరిస్క్ గర్భిణిల చికిత్సకోసం ప్రభుత్వాసుపత్రులకు వచ్చేలా ఉచిత వాహన సౌకర్యాన్ని కల్పించాం. వీరికి ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్లు ఇవ్వడం, బ్లడ్ ట్రాన్స్‌ఫూజన్ చేయడం వంటి సంరక్షణ చర్యల కారణంగా మాతృ, శిశు మరణాల్ని రాష్ట్రంలో చాలా వరకు నియంత్రించగలిగాం. తల్లీ బిడ్డల శ్రేయస్సుకోసం సరైన సమయంలో గర్భధారణపై దంపతులకు అవగాహన కల్పించాలి. ఇందుకోసం అనుసరించాల్సిన పద్ధతులపై గ్రామస్థాయిలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి. సురక్షిత ప్రసవాలు, పుట్టిన పిల్లలు ఆరోగ్యకరంగా ఉండాలన్న లక్ష్యంతో పనిచేయాలి. జాతీయ స్థాయిలో లక్ష జనాభాకు 95 మాతృ మరణాలుంటే ఏపీలో 45 మాతృ మరణాలు సంభవిస్తున్నాయి. ఏపీలో శిశు మరణాల్ని తగ్గించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం. దేశంలోనే మాతృ మరణాలు తక్కువగా ఉన్న కేరళను అధిగమించే దిశగా దృష్టి పెట్టాం.”
ప్రజారోగ్య కటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి, అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్, ఎన్‌హెచ్ఎం సిఎఓ ఆర్ గణపతిరావు, జాయింట్ డైరెక్టర్లు డాక్టర్ నిర్మలా గ్లోరీ, జనార్దన, డాక్టర్ తుళ్లూరి రమేష్, ఎన్సీడీ స్టేట్ కోఆర్డినేటర్ శ్యామల, నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ స్టేట్ నోడలాఫీసర్ విజయలక్ష్మి, పీఓ డాక్టర్ ఎల్బియస్ దేవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.