-గన్నవరం అభివృద్ది కమిటీ సమీక్షా సమావేశం
-సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
-గత ప్రభుత్వ హయంలో విమానాశ్రయ అభివృద్ది శూన్యం
-నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపి కేశినేని శివనాథ్
-కొత్త టెర్మినల్ నిర్మాణ పనులపై వారం వారం సమీక్ష
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి రాజధాని లో వున్న ఏకైక ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ను గత ప్రభుత్వం ఐదేళ్లుగా అభివృద్ది చేయకుండా కొత్త టెర్మినల్ పనులు అటకెక్కించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ఫూర్తిగా తీసుకుని కొత్త టెర్మినల్ ను ఏడాది కంటే తక్కువ సమయంలో తొమ్మిది నెలల్లో నిర్మించి ప్రజలకు, ప్రయాణీలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎయిర్ పోర్ట్ అథారిటీ కమిటీ వైస్ ఛైర్మన్, విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) చెప్పారు.
కొత్త టెర్మినల్ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు, ఏడాది లోపు పూర్తి చేసేందుకు చేపట్టాల్సిన కార్యచరణ గురించి ఎయిర్ పోర్ట్ అథారిటీ సభ్యుల సమీక్షా సమావేశం శుక్రవారం జరిగింది. విజయవాడ ఎయిర్ పోర్ట్ కాన్ఫరెన్స్ హాల్ లో ఎంపి కేశినేని శివనాథ్ ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తో పాటు ఎయిర్ పోర్ట్ ఎం.డి. లక్ష్మీ కాంత్ రెడ్డి, జనరల్ మేనేజర్ ప్రాజెక్ట్ ఎ.రామాచారి తో ఎయిర్ పోర్ట్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ సమీక్షా సమావేశానికి తొలిసారి హాజరైన ఎంపి కేశినేని శివనాథ్ కు ఎయిర్ పోర్ట్ అధికారులు, కాంట్రాక్టరులు పరిచయం చేసుకున్నారు. అలాగే కొత్త టెర్మినల్ భవనానికి ఎంత ఖర్చు అవుతుంది. టెర్మినల్ భవన నిర్మాణ పనులు ఏ దశలో వున్నాయో, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సవివరంగా వివరించారు. ఈ సమావేశం అనంతరం ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఎయిర్ పోర్ట్ ఎండి లక్ష్మీ కాంత్ రెడ్డి, ఇతర ఎయిర్ పోర్ట్ అధికారులతో కలిసి వెళ్లి టెర్మినల్ భవన నిర్మాణ పనులను సందర్శించి సమీక్షించారు.
అనంతరం ఎంపి కేశినేని శివనాథ్ మీడియా తో మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో వున్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయలేకపోవటం గత ప్రభుత్వం అసమర్థతగా పేర్కొన్నారు. కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సహకారం, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఎయిర్ పోర్ట్ టెర్మినల్ అభివృద్ధి పనులను తొమ్మిది నెలల్లోపు పూర్తిచేసి, ప్రజలకు అంకితం చేస్తామన్నారు. గతంలో ఈ విమానాశ్రయంలోని టెర్మినల్ ను ఏడాదిలోపే కట్టిన ట్రాక్ రికార్డ్ వుందని గుర్తు చేశారు. ఇక పై టెర్మినల్ భవన నిర్మాణ పనులపై వారం వారం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సాయాలతో రాష్ట్రంలోనే విజయవాడ ఎయిర్ పోర్ట్ ను నెంబర్ వన్ స్థానంలో వుంచేందుకు కృష్టి చేస్తామన్నారు. గత నెలలో ఇక్కడ నుంచి ప్రయాణికులకి ముంబై కి విమాన సర్వీసు అందబాటులోకి రాగా, ఈ నెల 16 నుంచి ముంబై, ఢిల్లీకి కూడా విమాన సర్వీసులు అందుబాటులో రానున్నాయని తెలిపారు. ఇక పై ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని కాంట్రాక్టర్లకు సూచించటం జరిగిందని, అలాగే ఎయిర్ పోర్ట్ అధికారులకు దిశా నిర్దేశాలు చేశారు.
అనంతరం గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రంతో పాటు రాజధానిలో వున్న ఈ విమానాశ్రయాన్ని గాలికి వదిలేసిందని మండిపడ్డారు. గన్నవరం ఎయిర్పోర్ట్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. గన్నవరంలో మల్లవల్లి ఇండస్ట్రియల్ కారిడార్, ఎయిర్ పోర్ట్ కి సమీపంలో ఐ టి తీసుకువచ్చి ఈ ప్రాంతాన్నిఅభివృద్ధి చేయటంతోపాటు, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు తో సహకారంతో గన్నవరాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని తెలియజేశారు.