-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థను సందర్శించిన ఆర్ పి సిసోడియా
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విపత్తుల ఎదుర్కోడానికి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలని వినియోగించుకోవాలని రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా సూచించారు. శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని సందర్శించిన ఆర్ పి సిసోడియా , సంస్థ అవలంబిస్తున్న సాంకేతికతలను పరిశీలించారు. ఎప్పటికప్పుడు ముందుస్తు జాగ్రత్త చర్యలు, ప్రణాళికలు అమలుచేస్తూ, హెచ్చరికలు జారీచేస్తూ ప్రాణ, ఆస్తి నష్టాల్ని తగ్గించాలని సిసోడియా సూచించారు. విపత్తుల్లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడంలో ఏపీ ముందు ఉండటం ముదావహమన్నారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తుపాన్లు, వరదలు, వడగాల్పులు, భారీవర్షాలు, పిడుగుపాటు హెచ్చరిక సమాచారాన్ని జిల్లాయంత్రాంగానికి పంపించే కార్యచరణ వివరించారు. స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్లో 24/7 వాతావరణాన్ని పర్యవేక్షించే విధానాన్ని తెలియజేసారు. వాతావరణ పరిశోధన విభాగాలలోని వివిధ అంశాలను వివరించారు. స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి పిడుగుపాటు పై తక్షణం స్పందించి కామన్ అలెర్ట్ ప్రోటోకాల్ , ఏపీ అలెర్ట్ ద్వారా ప్రజలకు హెచ్చరిక మేసేజ్లు పంపించే విధానాన్ని ప్రత్యక్షంగా సిసోడియాకు చూపించారు. ఈ సమావేశంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఏవో శ్రీధర్, ప్రాజెక్ట్ మేనేజర్స్ బస్వంత్, కిషోర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.