Breaking News

పతనమైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకోవాలి

-రిటైర్డ్ ఐఎయస్ అధికారి డాక్టర్ పి.వి.రమేష్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ లో గత ఐదు సంవత్సరాల కాలంలో ఆర్థిక వ్యవస్థ పతనమైందని, 14 లక్షల కోట్లకు అప్పులు పెరిగాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ పి.వి. రమేష్ పేర్కొన్నారు. ఈనెల 13వ తేదీన గుంటూరులో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి కార్యాచరణ అనే అంశంపై జరిగిన చర్చా గోష్టికి జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. ప్రధాన వక్తగా పాల్గొన్న డాక్టర్ పి.వి. రమేష్ ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులపై ప్రతిరోజు 75 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లిస్తున్నామని మరో 175 కోట్ల రూపాయలు ప్రతిరోజు అప్పులు చేసే దుస్థితికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దిగజారిందన్నారు. రాష్ట్ర విభజన ద్వారా తీవ్రంగా నష్టపోయామని తెలిపారు. గత ప్రభుత్వం చట్టబద్ధ దోపిడీ చేస్తూ మోసపూరిత వ్యాపార సంస్థగా మారిందన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థలో 80 శాతం ఉద్యోగులకు ఎలాంటి పని ఉండటం లేదన్నారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ప్రజలను కులాల ప్రాతిపదికగా విభజించి ఓట్లు పొందాలని భావిస్తున్నాయన్నారు. వ్యవసాయం, పారిశ్రామిక రంగాలలో ఉత్పాదకతను పెంచి, దళారి వ్యవస్థను తొలగించాలన్నారు. ఇంగ్లాండ్ లో అమలవుతున్న వైద్య విధానం మనదేశంలో కూడా అమలు చేస్తేనే పేదలకు మంచి వైద్యం లభిస్తుందన్నారు. మట్టి, ఇసుక, మైనింగ్ లాంటి సహజ వనరులను గత పాలకులు దోచుకుని అవినీతిని తారా స్థాయికి తీసుకుని వెళ్ళినారన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక్క శాతం జనాభా చేతిలో 44 శాతం ఆస్తులు, 24 శాతం ఆదాయం కలిగి ఉన్నారని, అట్టడుగు ఉన్న 50శాతం ప్రజలు కేవలం ఐదు శాతం ఆస్తులు కలిగి ఉన్నారని అన్నారు.ప్రజలలో కష్టపడే తత్వం,పని సంస్కృతిని, నైపుణ్యాలను పెంచాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ రెండు వేల జనాభా ఉన్న గ్రామాలలో ప్రతి సంవత్సరం సచివాలయ సిబ్బంది,వాలంటీర్లకు 60 లక్షల రూపాయలు జీతాల రూపంలో చెల్లిస్తున్నారాని ఆయా గ్రామాలలో 60 లక్షల రూపాయల అభివృద్ధి పనులు కూడా జరగడం లేదన్నారు. రేషన్ బియ్యాన్ని 98 శాతం లబ్ధిదారులు ఉపయోగించుకోవడం లేదని కిలో బియ్యం ఏడు రూపాయలు నుండి పది రూపాయలు వరకు మద్య దళారీ లకు అమ్ముతూ అవినీతి పెరగడానికి దోహదపడుతుందన్నారు. ఈ పరిస్థితులలో మంచి నాణ్యత గల సన్న బియ్యం అందించాలని కోరారు. మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ దేశ, విదేశాలలో అపారమైన అనుభవం కలిగి నీతి, నిజాయితీకి, నిబద్ధతకు మారుపేరుగా నిలిచిన రిటైర్డ్ ఐఎయస్ అధికారి డాక్టర్ పి.వి రమేష్ సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ఉపాధ్యక్షులు పి. రామచంద్ర రాజు, దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరివి వినయ్ కుమార్, మానవత సంస్థ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీనివాసరావు, మానవత చైర్మన్ పావులూరి రమేష్, ఆర్థిక శాస్త్ర అధ్యాపకులు డాక్టర్ అబ్బరాజు రాజశేఖర్, ఎం. కోటేశ్వరరావు, ప్రవేట్ విద్యాసంస్థల ఉపాధ్యక్షులు మేకల రవీంద్రబాబు, మానవత పూర్వ కార్యదర్శి రమణబాబు, తదితరులు ప్రసంగించారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *