Breaking News

మైనార్టీ లందరూ ఐకమత్యంగా మెలగాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వక్ఫ్ బోర్డ్ ఆస్తులను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, మైనార్టీ లందరూ ఐకమత్యంగా మెలగాలని, వారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో తోడ్పడుతుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఆబ్కారి శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం నగరంలోని రాజుపేట లో ఉన్న బిస్మిల్లా ఖాన్ షాదీఖానాలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొహరం పండుగ సందర్భంగా 123 మంది ఆస్థానాల ముజావర్లకు ఒక్కొక్కరికి 5000 రూపాయలు చొప్పున బ్యాంకు చెక్కులను మంత్రి మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరితో కలిసి అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ మొహరం పండుగ దేవునికి నివాళులర్పించే కార్యక్రమమని, 40 రోజులు పైగా దుఃఖ దినాలుగా దీక్ష పూని కర్బలా మైదానంలో జరిగిన త్యాగాలకు ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా షియా సోదరులు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నారన్నారు. హైదరాబాద్ తర్వాత మచిలీపట్నంలోనే ఈ కార్యక్రమం ఎంతో బాగా చేస్తారని ముస్లింలందరూ ఐకమత్యంగా మెలగాలని, వారికి ప్రభుత్వపరంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానన్నారు.

షియా సోదరులు మొక్కులు తీర్చుకోవడానికి ఆస్థానాలకు వస్తారని, ఆ ఆస్థానాలకు మరమ్మతులు చేపట్టి సున్నము వేయుట తదితర ఖర్చులకు గాను, ప్రస్తుతం మచిలీపట్నం నుండి 106 దరఖాస్తులు, పెడన నుండి 17 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఇటువంటి కార్యక్రమాలు చేయు ప్రాంతాలను గుర్తించి వారికి కూడా ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వారికి కూడా అవకాశం కల్పించి ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. వచ్చే సంవత్సరం అధిక మొత్తం మంజూరు చేసేందుకు వీలుగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తామన్నారు. గతంలో కమ్యూనిటీ హాలు కోసం స్థలం గుర్తించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదని త్వరలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇకపై తాను వారంలో ఒకరోజు నగర సంచారం చేసి ప్రజల బాగోగులను తెలుసుకుంటామన్నారు. అలాగే ఒకరోజు గ్రామీణ ప్రాంతంలో తిరిగి ప్రజలతో మమేకమవుతామన్నారు. మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ ప్రస్తుతం ఆస్థానాలకు ఇస్తున్న 5000 రూపాయలు ఆర్థిక సాయాన్ని వచ్చే సంవత్సరం పెంచేందుకు ప్రణాళిక ప్రకారం మంత్రితో కలిసి ప్రయత్నం చేస్తామన్నారు. స్వాతంత్రం వచ్చాక ఎన్నడూ చూడని ఎన్నికలు ఈసారి చూసామని ఓట్ల శాతంతో పాటు మెజారిటీ కూడా గొప్ప మెజారిటీ ఇచ్చి కూటమిని గెలిపించారన్నారు.

పోలైన ఓట్లే లక్ష ఓట్లు ఉంటే అందులో 50వేలకు పైగా ఓట్లతో మచిలీపట్నం శాసనసభ్యులు కొల్లు రవీంద్రను గెలిపించడం గొప్ప విశేషం అన్నారు. అలాగే తనను కూడా గొప్ప మెజారిటీతో గెలిపించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించి తమ భుజస్కంధాలపై భారం మోపారని, మా వంతు బాధ్యతగా పనిచేస్తామన్నారు. మచిలీపట్నంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం 1.10 కోట్ల రూపాయలు మంజూరు చేయించి వచ్చే 2, 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామన్నారు. అలాగే ఈద్గా ప్రహరీ నిర్మాణానికి 25 లక్షల రూపాయలు వచ్చే 4 సంవత్సరాలలో పూర్తి చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి షమీ ఉన్నిసా, స్థానిక నాయకులు బండి రామకృష్ణ, రాష్ట్ర వక్ఫ్ బోర్డు మాజీ డైరెక్టర్ అల్తాఫ్ హుస్సేన్, ముస్లిం సోదరులు రషీద్ హుస్సేన్, ఇలియాస్ భాష,షేక్ అమీర్ తదితర ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *