-వర్షపు నీరు నిలవ లేకుండా ఆర్ అండ్ బి సర్వే శాఖల ద్వారా అంచనా చేపట్టండి
-డ్రైనేజీ నిర్మాణం కోసం చర్యలు తీసుకోవాలి
-అంగన్ వాడి కేంద్రాల నిర్వహణా , ఓ హెచ్ ఆర్ నిర్వహణా పై ప్రశ్నలు సంధించిన కలెక్టర్
తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త :
అంగన్వాడీ కేంద్రాల, వో హెచ్ ఆర్ ట్యాంకులు నిర్వహణ కోసం క్షేత్ర స్థాయిలో చేపట్టిన సందర్శన పై సమగ్ర సమాచారాన్ని అందచేయాలని కలెక్టర్ పి. ప్రశాంతి స్పష్టం చేశారు. సీజనల్ వ్యాధుల నియంత్రణా, ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి పెట్టడంలో సచివాలయ , పంచాయతీ సిబ్బంది పనితీరు కీలకం అని కలెక్టర్ పి. ప్రశాంతి స్పష్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం గ్రామంలో కలెక్టర్ ఆకస్మికంగా పర్యటన చేసి, గ్రామంలో శానిటేషన్ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ, గ్రామంలో ఎక్కడ నీటి నిలువ లేకుండా తక్షణ పారుదల వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. వర్షాకాలం వలన నీటి నిలువలు వలన సీజనల్ వ్యాధులు వ్యాప్తి కి అవకాశం ఉన్న దృష్ట్యా తగిన జాగ్రత్తలు, తక్షణ రక్షణ చర్యలు తీసుకోవలసి ఉంటుందన్నారు. మెదర పేట కు చెందిన రహదారి మార్గంలో నిలుచి ఉన్న నీటిని కాలువల ద్వారా బోదిలోకి తరలించే విధంగా చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. స్థానికంగా నివాసం ఉండే వారు వారి స్థలం నుంచి కాకుండా పంచాయతి స్థలం నుంచి డ్రైన్ ఏర్పాటు చేసుకోవాలని అభ్యంతరం వ్యక్తం చేసినట్లు కలెక్టర్ దృష్టికి తీసుకుని వచ్చారు. ప్రజారోగ్యం కోసం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, వెంటనే వర్షపు నీరు నిలవ లేకుండా ఆర్ అండ్ బి సర్వే శాఖల ద్వారా అంచనా చేపట్టి హద్దులు గుర్తించి కాలువ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఓ హెచ్ ఆర్ ట్యాంకులను పరిశుభ్రం చేసి, బ్లీచింగ్ చేసి, నిర్ణీత సమయం వరకు ఆరబెట్టి నీటి సరఫరా చెయ్యాల్సి ఉంటుందని తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియా అని తెలియ చేశారు.
కలెక్టర్ పర్యటనలు గ్రామపంచాయతీ కార్యదర్శి డి . శ్రీనివాస్, సచివాలయం, పంచాయతీ సిబ్బంది స్థానికులు పాల్గొన్నారు.