రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని అన్ని సంక్షేమ శాఖల వసతి గృహలలో మరమ్మత్తులను గుర్తించి, వాటికి సీ ఎస్ ఆర్ నిధులను కేటాయించి సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ విడిది కార్యాలయ సమావేశ మందిరంలో సంక్షేమ శాఖల అధికారులకు సంక్షేమ వసతి గృహాల నిర్వహణా పై దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని సాంఘిక, గిరిజన, బిసి సంక్షేమ వసతి గృహాల నిర్వహణా, మౌలిక సదుపాయాలు విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలి అని స్పష్టం చేశారు. విద్యా విధానంలో మెరుగైన ఫలితాలను సాధించడం లో ఆయా వసతి గృహాల నిర్వహణ కూడా ఒక ప్రథాన అంశం అన్నారు. వివిధ పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో వసతి గృహాలపై ప్రతికూల కథనాలు వస్తున్నాయనీ , సరైన నిర్వహణ వ్యవస్థ దిశగా అడుగులు వేయాల్సి ఉందన్నారు. వసతి గృహలలో తక్షణం చేపట్టాల్సిన మరమ్మత్తులను గుర్తించి, వాటికి సీ ఎస్ ఆర్ (కార్పొరేట్ సామాజిక బాధ్యత) నిధులను కేటాయించి సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. అందుకు అనుగుణంగా ప్రతిపాదన సిద్ధం చేసి నివేదిక అందజేయాలన్నారు. త్వరలో వాటిపై సమగ్రంగా చర్చించ నున్నట్లు తెలియ చేసారు.
ఈ సమావేశం జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎమ్. సందీప్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారిని కె ఎస్ జ్యోతి, కొవ్వూరు బిసి సంక్షేమ అధికారి కే. రామకృష్ణ తదితరులు హాజరయ్యారు.