-గౌతమి గ్రంథాలయం, టౌన్ హాల్, దామెర్ల ఆర్ట్ గ్యాలరీ సందర్శన
-స్ధానిక దర్శనీయ స్థలాలు, వాటి విశిష్టత పై పరిశీలన
-వాటికీ పూర్వ వైభవం కోసం కృషి చెయ్యాలి
-కలెక్టర్ ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం లో గుర్తింపు పొందిన, బహుళ ప్రాచుర్యం కలిగిన ప్రదేశాలను సందర్శించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. వాటి ప్రాశిస్థానికి తగిన గుర్తింపు కోసం కృషి చెయ్యడం జరుగుతుందని తెలిపారు. బుధవారం నగరంలోని గౌతమి గ్రంథాలయం, టౌన్ హాల్, దామెర్ల ఆర్ట్ గ్యాలరీ లని సందర్శించి అక్కడి పరిస్థితు లను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు పి. ప్రశాంతి వివరాలు తెలియ చేస్తూ, రానున్న 2027 గోదావరి పుష్కరాల నేపధ్యంలో రాజమహేంద్రవరం లో పర్యాటక రంగం పరంగా, దర్శనీయ స్థలాలు గుర్తించి వాటి గుర్తింపు కోసం క్షేత్ర స్థాయిలో పర్యటించి అధ్యయనం చెయ్యడం జరిగిందన్నారు. గౌతమీ గ్రంథాలయ సందర్శన సమయంలో లైబ్రేరియన్ జి. శ్రీదేవి …. అక్కడ లభ్యత లో ఉన్న వివిధ పురాతన గ్రంథాలను చూపించడం జరిగింది. బ్రిటిషర్ మెకంజీ సంస్కృతం, తెలుగులో స్వయంగా రాసిన పుస్తకాన్ని, రాగి రేకుల ప్రతులను చూపించడం జరిగింది. ఇక్కడ ఉన్న రికార్డులు, పుస్తకాలు చూసిన కలెక్టర్ సందర్శకుల రిజిస్టర్ లో సంతకం చెయ్యడం జరిగింది. గౌతమీ గ్రంథాలయానికి పూర్వ వైభవం తీసుకుని రావడం తో పాటు మౌలిక సదుపాయాలూ, మానవ వనరుల అభివృద్ధి కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరుగుతుందనీ, ఆమేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం స్థానిక ఆర్డిఓ కార్యాలయ సమీపంలోని దామెర్ల ఆర్ట్ గ్యాలరీ ను సందర్శించారు. దామెర్ల ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించిన వివిధ చిత్రాలను పరిశీలించి, వాటి యొక్క కళా నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో మరింతగా ఈ ఆర్ట్ గ్యాలరీ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. గ్యాలరీ ఇన్చార్జి వి నాగేశ్వరరావు వివరాలు తెలుపుతూ ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4.30 వరకు సందర్శకులను అనుమతించడం జరుగుతుందని ప్రవేశం ఉచితమని ఆయన తెలిపారు.