-మానవీయ విలువలు కాపాడడం ప్రతీ ఒక్కరి బాధ్యత
-వృద్ధులు, అనాథ పిల్లల పట్ల మానవత్వం కలిగి ఉండాలి
-కలెక్టర్ పి. ప్రశాంతి
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
నేడు ఆధునిక కాలంలో మానవ విలువలు అంతరించి పోతున్నాయని, నేటి ఆధునిక సమాజంలో వృద్ధాశ్రమాల అవసరం పెరుగుతోందని, వాటి నిర్వహణా విషయంలో తగినజాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం నారాయణపురం లో ఉన్న శ్రీ గౌతమీ జీవ కారుణ్య వృద్ధుల ఆశ్రమాన్ని సందర్శించి అక్కడ వృద్ధులతో మాట్లాడడం జరిగింది. ఆశ్రమం ఆవరణలో జామ మొక్కను కలెక్టర్ నాటారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ, వృద్ధాశ్రమాల్లో ఆదరణ పొందుతున్న వృద్ధులకు చిన్నారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి వారి బాగోగులు చూడాలని నిర్వాహకులకు సూచించారు. నేడు వృద్ధులు ఆదరణ కోల్పోయి వృద్ధాశ్రమాలకు చేరుతున్న ఘటనలు చూస్తున్నామన్నారు. నిరాదరణ గురుదైన వృద్ధుల పట్ల, అనాథ పిల్లల పట్ల మానవత్వంతో వ్యవహరించాల్సి ఉందన్నారు. వారికి మనం ఉన్నామనే భరోసా కల్పించి , మన వంతుగా చేయూతను అందించాలని తెలియజేశారు. ఆశ్రమ నిర్వహణ పట్ల మరింత జాగ్రత్త వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
వృద్ధాశ్రమంలో 66 మంది వృద్ధులతోపాటు 22 మంది అనాధ పిల్లలకు ఆశ్రయం ఇస్తున్నట్లు నిర్వాహకులు ఈ వో వి. పల్లం రాజు వివరించారు. ఆశ్రమం లో ఉన్న వృద్ధుల కోసం పిల్లల కోసం దాతలు స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వడం, అన్నదానం చేయడం వంటి కార్యక్రమాలు స్వచ్ఛందంగా పాల్గొనడం జరుగుతుందని వివరించారు. వృద్ధులకు ఉదయం అల్పాహారం కోసం రూ 2 వేలు, ఒక పూట భోజనం కోసం రూ.4,500 లు, అనాథ పిల్లల అల్పాహారం కోసం రూ 1,000 లు, ఒక పూట భోజనం కోసం రూ.2,500 లు విరాళంగా ఇస్తే వృద్ధాశ్రమ నిర్వాహకులు ద్వారా వారి పేరున ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. పిల్లల పుట్టిన రోజు, పెద్దల గుర్తుగా వివరాలు ఇవ్వడం జరుగుతుందనీ, నేరుగా ఆశ్రమం నిర్వాహకులను కలిసి వివరాలు తెలుసుకునే అవకాశం ఉందన్నారు.