-అధిక వర్షాల నేపథ్యంలో ఎంపీ పురందేశ్వరి సూచన
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి గురువారం ఒక ప్రకటనలో సూచనలు చేసారు.
మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసినందున అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. వర్షంలో బయట ఎక్కువగా తిరగవద్దని కోరారు. రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆమె సూచించారు. ఈమేరకు జిల్లా కలెక్టర్ తో ఎంపీ పురందేశ్వరి మాట్లాడారు. అధిక వర్షాల వలన తలెత్తే సమస్యలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. డయేరియా, వైరల్ ఫీవర్స్ ప్రబలకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. పల్లపు ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని, ఒకవేళ ఎక్కడైనా ఇబ్బందులు వస్తే వెంటనే మరమత్తులు చేయాలని ఎంపీ పురందేశ్వరి సూచించారు
ఈ నెంబర్లను సంప్రదించండి అధిక వర్షాల వలన రాజమండ్రి పార్లమెంట్ నియోజక వర్గంలో ఎక్కడైనా సమస్యలు, ఇబ్బందులు తలెత్తిన పక్షంలో 87903-78374, 94923-85664 నెంబర్లను సంప్రదించాలని ఎంపీ కార్యాలయం ఒక ప్రకటనలో తెల్పింది. తమ దృష్టికి తెచ్చిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ఏర్పాట్లు చేస్తామని పేర్కొంది.