అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్లో|| ఏకాక్షరప్రదాతారం, యో గురుం నాభిమన్యతే|
స శ్వయోనిశతం గత్వా, చండాలత్వం అవాప్నుయాత్||
అన్నింటికంటే గురుద్రోహం మహాపాతకం. గురుద్రోహికి ప్రాయశ్చిత్తం చాలా కష్టం. ఒక్క అక్షరం లేక ఓంకారం, ఉపదేశంగా ప్రసాదించిన గురువును గౌరవించని పాపి వరుసగా నూరుజన్మలు కుక్కగా పుడతాడు. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఆషాఢ శుక్ల ద్వాదశీ వ్రతం.
ఆషాఢ శుక్ల ద్వాదశి నాడు ఉదయం లేచి శిరస్నానం చేసి గోపంచకంతో విప్రుల పాదాలు కడిగి, ఆపై శివాలయంలోని అర్చకునకు స్వయంపాకాదులు దానం చేస్తే, గురుద్రోహ పాపం నశిస్తుంది.
సత్యవతికి, పరాశరమహర్షికి శ్రీమహావిష్ణువు అంశతో వ్యాసమహర్షి జన్మించిన తిథి ఆషాఢపూర్ణిమ. ఇదే వ్యాసపూర్ణిమ, గురుపూర్ణిమగా ప్రసిద్ధికెక్కినది. అనంతరం ఏకరూపం అయిన వేదాన్ని విభజించి వేదవ్యాసుడయ్యాడాయన. అష్టాదశమహాపురాణాలను, ఉపపురాణాలను, మహాభారతసంహితను, బ్రహ్మసూత్రాలను లోకాలకి అందించిన విష్ణుస్వరూపుడైన వ్యాసుని జన్మమాసం ఈ ఆషాఢమాసం. పూర్ణిమ నాడు గురుపూజ చేసినవారు దక్షిణామూర్తి స్వరూపులవుతారు.
1. వేదవ్యాసుడు సాక్షాత్తు విఘ్ణస్వరూపుడు. వ్యాసో నారాయణో హరిః అని సమస్త జగత్తు ఆయన్ని కీర్తించింది.
2. శ్రీమన్నారాయణుడు భూమిపై ధరించిన ఇరవైరెండు అవతారాల్లో ఒక దివ్య అవతారం వ్యాసావతారం.
3. సత్యవతికి, పరాశరుడికి వ్యాసుడు ఆషాఢమాసంలో పూర్ణిమ నాడు సరిగ్గా మధ్యాహ్నం సమయంలో ఇంచుమించుగా 11:౩౦ కి ఆవిర్భవించినట్టుగా పురాణాలు చెపుతున్నాయి.
4. వ్యాసపూర్ణిమని గురుపూర్ణిమ అని పిలవబడడానికి కారణం అందరికి గురువు ఆయనే. విష్ణువు వ్యాసుడి రూపంలో వచ్చి వేదములను విభజించి ఇచ్చిన మహానుభావుడు.
ఆచరించవలసిన విధివిధానములు
1. మనం ఎక్కడున్నా తప్పకుండా గురువుని ధ్యానించాలి, కుదిరితే గురువుని దర్శించి సేవ చేసి, ప్రదక్షిణ చేసి దక్షిణ సమర్పించాలి.
2. గురువుకి దూరంగా ఉన్నవారు ఇంట్లోనే కూర్చుని యథాశక్తిగా గురువుని అర్చించాలి.
3. ఎంత ఎక్కువ గురుస్మరణ చేస్తే, జీవితంలో అంత ఎక్కువ శుభాలను పొందుతారు.
4. అమ్మవారి దగ్గర ఉన్న చింతామణి ఇచ్చేటటువంటి శుభాలు పొందాలంటే గురువు పాదాలు పట్టుకోవాలి.
5. గురువు అనుగ్రహిస్తే యోగాలు కూడా పొందలేనటువంటి శుభాలు ఈ జన్మలో పొందవచ్చు.
6. వ్యాసపూర్ణిమ నాడు తప్పక గురువును పూజించడం వల్ల భగవంతుడి అనుగ్రహం పొందవచ్చు. అందువల్లే తమ గురువుని వ్యాసుడిగా భావించి భక్తితో పూజించాలి.