-వివిధ ప్రాంతాల నుండి వచ్చి తమ బాధతుల చెప్పుకున్న సామాన్యులు
-15 సెంట్ల స్థలాన్ని సెంటు పట్టాల జాబితాలో కలిపి పరిహారం కొట్టేశారని ఆచంట మహిళ ఆవేదన
-సంతకాల ఫోర్జరీతో రూ.30 లక్షల రుణాలు తెచ్చారన్న చిలకలూరిపేట డ్వాక్రా మహిళలు
-విచారణ చేయించి చర్యలు తీసుకుంటామని సీఎం హామీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలు, పార్టీ కార్యకర్తలు నుండి వినతులు స్వీకరించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజలు, కార్యకర్తల నుండి నేరుగా వినతులు తీసుకుని వారి సమస్యలు విన్నారు. గత ప్రభుత్వంలో తాము ఎలా బాధితులు అయ్యిందీ వివరించారు. వైసీపీ నేతలు అక్రమంగా లాక్కున్న తమ ఆస్తులను తిరిగి తమకు అప్పగించేలా చూడాలని కోరారు. సంతకాలు ఫోర్జరీ చేసి బ్యాంకుల్లో రుణాలు తీసుకొచ్చారని యానిమేటర్లపై డ్వాక్రా సంఘాల సభ్యులు ఫిర్యాదు చేశారు. ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి సీఎం వస్తుండటంతో వికలాంగులు, వృద్ధులు వచ్చి తమ బాధలు చెప్పుకున్నారు. ఆచంట నియోజకవర్గం, వెంకటాలచెరువుకు చెందిన పిల్లి పార్వతి అనే మహిళ తన భూమిని వైసీపీలోని తమ బంధువులు ఆక్రమించారని సీఎంకు తెలిపారు. తన భూమిని తిరిగి ఇప్పించాలని కోరారు. బాధితురాలు పార్వతి తెలియజేసిన వివరాల ప్రకారం ‘‘నేను 15 ఏళ్ల క్రితం వెంకటాల చెరువులో రూ.23 లక్షల పెట్టి 15 సెంట్ల స్థలం కొన్నాను. ఉపాధి నిమిత్తం నేను కువైట్ కు వెళ్లాను. 2021లో కువైట్ నుండి వచ్చే సరికి నా స్థలానికి ఉన్న పెన్షింగ్ తొలగించారు. నా స్థలానికి వెనకవైపు ప్రాంతంలో గత ప్రభుత్వం సెంటు పట్టా స్థలాలు ఇచ్చింది. ఆ స్థలాలకు దారి లేదు. దాని కోసం నా 15 సెంట్ల స్థలాన్ని వైసీపీలో ఉన్న మా బంధువులు అధికార అండతో లాగేసుకున్నారు. నేను చనిపోయినట్లు చెప్పి నా సోదరి కుమారుడు గుబ్బ శ్రీనివాస్ పేరుపై తప్పుడు పత్రాలు సృష్టించారు. నేను ప్రశ్నిస్తే గుబ్బల శ్రీనివాస్, సతీష్, నాగేశ్వరరావు, వరలక్ష్మీతో పాటు మరికొంత మంది కలిసి దాడి చేసి గాయపరిచారు. పోలీసులకు చెప్పినా నాడు పట్టించుకోలేదు. దారికోసం కొంత స్థలం పోగా మిగిలిన 5 సెంట్ల స్థలాన్ని సెంటు పట్టాలలో కలిపారు. ఈ 15 సెంట్లకు గాను ప్రభుత్వం నుండి పరిహారాన్ని వారు పొందారు. స్థలం కోసం నేను పోరాటం చేస్తుండటంతో రూ.60 లక్షలు చెల్లిస్తే తిరిగి స్థలం అప్పగిస్తామని అంటున్నారు. నా స్థలం కొట్టేసిందే కాకుండా నాపైనే కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. కోర్టు కేసుల వల్ల ఉపాధి కోసం కువైట్ కూడా వెళ్లలేకపోతున్నాను. నా స్థలాన్ని తిరిగి నాకు ఇప్పించండి’’ అని పిల్లి పార్వతి ముఖ్యమంత్రి వద్ద విలపించారు. సావధానంగా సమస్యను విన్న చంద్రబాబు తిరిగి స్థలం వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. చిలకలూరిపేట నియోజక వర్గం, తిమ్మాపురంనకు చెందిన అనీలా డ్వాక్రా సంఘ సభ్యులు సీఎంను కలిశారు. గ్రూపు సభ్యుల అనుమతి లేకుండా యానిమేటర్లు తమ సంతకాలు ఫోర్జరీలు చేశారని, తద్వారా యూనియన్, గోదావరి బ్యాంక్ లో రూ.30 లక్షల రుణాలు తీసుకున్నారని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. తాము పోలీసులను ఆశ్రయించగా 5 నెలల్లో సొమ్ము తిరిగి ఇస్తామని అంగీకారం పత్రం రాసిచ్చినప్పుటికీ నేటికీ ఆ సొమ్ము చెల్లించలేదన్నారు. పైగా పోలీసులతో కుమ్మక్కై బెదిరిస్తున్నారన్నారు. రుణం సొమ్ము చెల్లించాలని బ్యాంకు అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై విచారణ చేయించి, నిందితులపై చర్యలు తీసుకుని సొమ్మును రికవరీ చేయిస్తామని సీఎం హామీ ఇచ్చారు.