అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మనందరిలోనూ పవిత్రమయిన హృదయం ఉంది. కాని చీకటి అనే అజ్ఞానంతో మనసంతా చెడు ఆలోచనలతోనూ , దుర్గుణాలతోను నిండిపోవడం వల్ల దానిని గుర్తించలేక పోతున్నాము. మన అజ్ఞానం ఎంతంటే? దీపం వెలిగించ మన్నప్పుడు నీటికీ , నూనెకు తేడా తెలియనట్టు వంటి చీకటి స్థితిలో ఉన్నాము. మరి ఈ చీకటి స్థితి నుంచి బయటపడి జ్ఞానదీపాన్ని వెలించు కోవాలంటే మంచి సద్గురువు చాలా అవసరం.
గురువు అంటే :-
గురువు అంటే బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులు ఒకటై జన్మించిన రూపం అంటే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమే గురువు. గు అంటే అంధకారము లేదా అజ్ఞానాన్ని , రు అంటే నిరోధించుట లేక నశింప చేయుట అని గురువు అంటే అజ్ఞానాన్ని నశింప చేయువారు అని అర్ధము. గు శబ్దమంధకారస్యరుతన్నిరోధకః అని పెద్దల వచనం! గురువు చేయవలసినది తన శిష్యులను అంధకారంలోంచి వెలుగులోకి తీసుకు రావడం. ఈ భౌతిక జగత్తులో ఏ మానవుడూ సంసారయాతనలు అనుభవించకుండా చూడటం ఆ గురువు కర్తవ్యం.
ఆ గురువు సాన్నిధ్యంలో కామ క్రోధ , లోభ , మోహ , మద , మాత్సర్యాలు అనే దుర్గుణాలను , అహంకారాన్ని విడిచిపెట్టి ధ్యాన సాధన చేస్తే హృదయం పవిత్రమవుతుంది. అప్పుడు ఆ పవిత్ర మైన హృదయంలో జ్ఞానమనే దీపం వెలిగించుకోవడం సాధ్యమవుతుంది.
విజ్ఞానానికి మూలం విద్య. ఆ విజ్ఞానాన్ని నేర్పేవాడే గురువు. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించే గురువుని ఎప్పుడూ గౌరవించాలి. ఒకప్పుడు గురుకులాలుండేవి. వాటిలో చేరిని విద్యార్థులకు తల్లీ తండ్రీ అన్నీ తామే అయ్యేవారు గురువులు. మాతృదేవోభవ , పితృదేవోభవ , ఆచార్యదేవోభవ అంటారు. తల్లీ తండ్రీ తరువాత స్థానం గురువుదే.
“గురుబ్రహ్మ, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః”
దైవోపచారం చేస్తే గురువైనా రక్షిస్తాడు. అదే గురువుకు కోపం వస్తే ముల్లోకాలలో ఎవరూ రక్షించలేరట. అందుకే సమస్త విద్యలను నేర్పే గురువుకు , జ్ఞనాన్ని అందించే గురువుకు సేవచేసి , గురుకృప పొంది మహనీయులైనవారు ఎందరో వున్నారు.
“గురువునూ , గోవిందుడిని పక్కనపెట్టి ముందు ఎవరికి నమస్కారం చేస్తావంటే , గురువుకే నమస్కరిస్తాను. కారణం గోవిందుడు వున్నాడని చెప్పింది గురువేకదా” అంటాడు భక్త కబీర్ దాస్. అదీ మన భరతీయసంస్కృతి ఆర్షధర్మం నేర్పిన గురువు యొక్క ప్రాముఖ్యం. కాబట్టి గురుపౌర్ణమినాడు ప్రతి ఒక్కరూ గురువుల్ని సేవించాలి.
గురు పూర్ణిమ విశిష్టత :-
వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ !
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ !!
వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే !
నమో వైబ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః !!
ప్రతి సంవత్సరం ఆషాడ శుద్ధ పౌర్ణమి రోజున వ్యాస మహర్షి జన్మ తిథి అయిన గురు పూర్ణిమ గా మనం జరుపుకుంటాం. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి , ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు.
గురువుల పట్ల ఇదే గౌరవం అన్నివేళలా పాటిస్తున్నప్పటికీ ఈ రోజు వ్యాసమహాముని పుట్టిన రోజు కాబట్టి దీనికంత ప్రాధాన్యత ఉంది. గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరుచుకుని ఉంటారు. ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు. తర తరాలకూ కొనసాగవచ్చు.
సనాతన ధర్మంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధాన కర్తగా భావిస్తుంటారు. వేదవ్యాసుని మానవజాతి కంతటికి మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళారు కాబట్టి ఆయనను మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు.
లోకానికంతటికీ జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి వ్యాసుని జన్మ తిథిఅయిన ఆషాఢ శుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమగా జరుపుకోవడం ఆచారమైంది. మామూలు రోజులలో కన్నా ఈ వ్యాస పూర్ణిమ నాడు గురువు నుండి వెలువడే ఆశీర్వచనాలు వేయి రెట్లు ఎక్కువగా పొంద వచ్చట.. అందుకే ఈ రోజు గురుపూజోత్సవం లో పాల్గొని గురువు కరుణా కటాక్షములను పొందవచ్చు..
గురు అనే పదంలో ’గు’ అనే అక్షరం అంధకారాన్ని ’రు’ అనే అక్షరం వెలుగును సూచిస్తాయి..
ఙ్ఞానశక్తి సమారూఢః తత్త్వమాలావిభూషితః |
భుక్తిముక్తి ప్రదాతా చ తస్మై శ్రీ గురవే నమః ||
శిష్యునిలో అజ్ఞానాంధకారాలను తొలగించే బాధ్యతను గురువు తీసుకుంటాడు.. కాబట్టి… గురువుకే ప్రథమ స్థానమునిచ్చారు.. మాతా , పిత , గురువులలో జన్మనిచ్చిన వారి ప్రక్కన గురువుకి అత్యంత విశిష్టమైన స్థానాన్ని కల్పించినది ఇందుకే…
అలానే ఈ రోజు తప్పకుండా ఈ శ్లోకం స్మరించుకోవాలి..
నమోస్తుతే వ్యాస విశాల బుద్దే పుల్లార విందాయత పత్రనేత్ర |
వినత్వయా భారత తైల పూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమాయః ప్రదీపః ||
న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః |
తత్త్వఙ్ఞానాత్పరం నాస్తి తస్మై శ్రీగురవే నమః ||
(’గురువును మించిన తత్వం తపస్సు జ్ఞానం వేరొకటి లేవు’)
గురుపౌర్ణమినాడు వ్యాసులవారు రచించిన ఏ గ్రంథం చదివినా , చాలా మంచిది. గురుపీఠానికి ఆద్యులైన నారాయణుడిని , సదాశివుడిని , బ్రహ్మదేవుడిని , వసిష్ఠులవారిని , శక్తిమునిని , పరాశరుడిని , వ్యాసులవారిని , శుకమహామునిని , గౌడపాదులవారిని , గోవింద భగవత్పాదులను, శంకరాచార్యులవారిని ఈ రోజు పూజిస్తే విశేషఫలం లభిస్తుంది. అంతేకాదు తమ గురువులను కూడా ప్రతి ఒక్కరూ ఈ రోజున గౌరవించి పూజించాలి.
వ్యాస పూర్ణిమ గురుపూర్ణిమ
నిజానికి వ్యాసుడు అనేది ఒక పదవి పేరు. ప్రతీ ద్వాపరయుగం లోనూ ఒక వ్యాసుడు ఉద్భవిస్తాడు. సాక్షాత్తు ఆ శ్రీమన్నారయణుడే వ్యాసుడుగా అవతరిస్తాడు. ఈ అనంతంగా తిరిగే కాలచక్రంలో ధర్మం కృతయుగంలో 4 పాదాలతో , త్రేతాయుగంలో 3 పాదాలతో , ద్వాపరయుగంలో2 పాదాలతో , ఈ కలియుగంలో 1 వ పాదంతో , నడుస్తుంది.
వసిష్ఠమహామునికి మునిమనుమడు , శక్తి మహామునికి మనుమడు , పరాశరమునికి పుత్రుడు , శుకమర్షికి జనకుడైనట్టియు , నిర్మలుడైనట్టి , తపవు అనే ధనరాశి గలిగిన శ్రీ వ్యాసులవారికి నమస్కారము. ఆదిగురువు వేదవ్యాసులవారు. వ్యాసులవారు పుట్టినరోజునే గురుపూర్ణిమ , వ్యాసపూర్ణిమ , అంటారు
నారాయణమూర్తి స్వరూపమే వేదవ్యాసులవారు. అందుకే ఆయన్ని అపర నారాయణుడని పిలుస్తారు. వేదవిభజన చేసిన మహానుభావుడాయన. ఆయనవల్లనే మనకు అష్టాదశ పురాణాలు ఏర్పడ్డాయి. భారత భాగవతాలనందించినవారే వ్యాసులవారు.
వ్యాసమహర్షి ఒక వ్యక్తి పేరు మాత్రమే కాదు. ప్రతి ద్వాపర యుగములోను ఒక సారి వ్యాసుడు ఉద్భవిస్తాడు. ప్రస్తుతం మనం ఉంటున్నది వైవస్వత మన్వంతరంలో ని 28 వ యుగంలోని వ్యాసుడు కృష్ణద్వైపాయనుడు కాలంలో.
ఇంతవరకు వ్యాసపీఠాన్నధిరోహించిన వ్యాసులు పేర్లు
1. స్వాయంభువ
2. ప్రజాపతి
3. ఉశన
4. బృహశ్పతి
5. సవిత
6. మృత్యువు
7. ఇంద్ర
8. వశిష్ఠ
9. సారస్వత
10. త్రిధామ
11. త్రివృష
12. భరద్వాజ
13. అంతరిక్షక
14. ధర్ముడు
15. త్రయారుణ
16. ధనుంజయుడు
17. కృతంజయుడు
18. సంజయ
19. భరద్వాజ
20 గౌతమ
21. ఉత్తముడు
22. వాజశ్రవ
23. సోమశుష్మాయణ
24. ఋక్షుడు
25 శక్తి
26. పరాశరుడు
27. జాతూకర్ణి ప్రస్తుతం 28 వ వేదవ్యాసుని పేరు కృష్ణద్వైపాయనుడు.
ఆయన జన్మించిన తిథి అయిన ఆషాఢ శుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమ గా జరుపుకుంటాం. లోకానికంతటికీ జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి వ్యాసుని జన్మ తిథిని గురు పూర్ణిమగా జరుపుకోవడం ఆచారమైంది.
28 వ వేద వ్యాసుల వారి జయంతి. ఇతడు పరాశర మహర్షికి , మత్స్య గంధికి (సత్యవతి) కి కృష్ణ వర్ణం (నల్లని రంగు) తో ఒక ద్వీపంలో జన్మించారు కనుక కృష్ణద్వైపాయనుడు అని పిలవబడ్డాడు. పుట్టీ పుట్టగానే చేతిలో కమండలం , దండము చేతబట్టి తపస్సు చేసుకోవటానికి వెళ్తానని తల్లి మత్ష్యగంధి అనుమతితో తపస్సుకు వెళ్ళిన తపోధనుడు కృష్ణద్వైపాయనుడు.
వ్యాస మహర్షి నాలుగు వేదాలను విభజించి లోకానికి అందించాడని పురాణాలు చెబుతున్నాయి. పూర్వం సోమకాసురుడు వేదాలను సముద్రంలో దాచేస్తే.. శ్రీ మహా విష్ణువు మత్స్యావతారంలో ఆ వేదాలను తీసుకొచ్చాడు. అలా వచ్చిన వేదాలు ఒకదానితో ఒకటి కలిసి కలగాపులగం అయిపోగా.. వాటిని వ్యాస మహర్షి విడదీసి విభజించి నాలుగు వేదాలుగా లోకానికి అందించాడు. వేదరాశి ని నిత్య కర్మలలో క్రతువుల్లో వాడే ఉపయోగాలను బట్టి ఋక్-యజుర్-సామ-అధర్వణ వేదాలుగా విభజించి వేదవ్యాసుడైనాడు. ఆతర్వాత బ్రహ్మదేవుని ఆజ్ఞతో విఘ్నేశ్వరుడు రాయగా … వేదసారాన్నంతా చేర్చి పంచమవేదంగా ప్రసిద్ధికెక్కిన భారత ఇతిహాసాన్ని గ్రంధస్తం చేసాడు. అంతేకాక భాగవతాన్ని , అష్టాదశ పురాణాలను మనకు ప్రసాదించాడు. సాక్షాతు శ్రీ మహా విష్ణువు అవతారంగా భావించే వ్యాస భగవానుని గానూ ఆదిగురువుగానూ భావిస్తారు.
విష్ణు సహస్రనామ పీఠిక లో కూడా…..
“వ్యాసాయ విష్ణు రూపాయ – వ్యాస రూపాయ విష్ణవే
నమోవై బ్రహ్మ నిధయే వాశిష్టాయ నమోనమ: !!
అని వ్యాసునికి విష్ణువుకు అభేదం చెప్ప బడింది , వేదవ్యాసుడు అనంతంగా ఉన్న వేదాలని విభజించి పైలుడను శిష్యునకు ఋక్సంహితను , వైశంపాయనునకు యజుస్సంహితను , జైమినికి సామసంహితను , సుమంతునకు అధర్వణ సంహితను భోధించి వానిని లోకములో వ్యాప్తి చేయండని ఆదేశించాడు. వ్యాసుడు వేదాలని విభజించటమే కాకుండా అష్టా దశ పురాణాల్ని , ఉపపురాణాలను రచించాడు. బ్రహ్మసూత్రాల్ని వివరించాడు , భారత , భాగవతాలని రచించాడు. తాను గ్రంథస్థం చేసిన పురాణేతిహాసములను సూతునకు తెలియజేసి ప్రచారం చేయమని చెప్పాడు.
వ్యాస భగవానుని అనుగ్రహం వలన జ్ఞానం విస్తరించి విశ్వవ్యాప్తం అయ్యింది. సూత మహాముని ప్రథాన ప్రచారకుడై విషయములు బహుళ ప్రచారం చేసాడు.
స్మృతి కర్తలలో వ్యాసులవారు ఒకరు. రెండధ్యాయముల ఈ గ్రంథానికి లఘు వ్యాస స్మృతి అని పేరు. ఇందులో మానవులకు ఉపయోగ పడే ఆచార విషయములు ఉన్నాయి. ఇదే వ్యాస సంహిత గా విఖ్యాతి పొందింది.
వ్యాస మహర్షి సుపుత్రుని కోసం తపస్సు చేసి శివుని నుంచి వరాన్ని పొందాడు. ఆయనకు ఘృతాచి అనే అప్సరస వలన బ్రహ్మ జ్ఞాని ఐన శుకుడు జన్మించాడు.
వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే , పౌత్రమకల్మషమ్ |
పరాశరాత్మజమ్ వందే శుక తాతం తపోనిధిమ్ ||
తాత్పర్యం:- వశిష్టుని మునిమనుమడైన కల్మష రహితుడైన శక్తికి మనుమడైన పరాశరుని కుమారుడైన , శుకమహర్షి తండ్రి అయిన ఓ వ్యాస మహర్షి నీకు వందనము.
” వ్యాసో నారాయణో హరిః ” అన్నారు. వ్యాస భగవానులు సప్త చిరంజీవులలో ఒకరు.
మహాభారత రచన :-
మహాభారత రచనకు తనమనసులో ఒక ప్రణాళికను తయారుచేసుకొన్నాడు వేదవ్యాసుడు. తాను చెబుతుంటే….. అంత వేగంగా వ్రాసే వారు ఎవరు ఉన్నారూ అని విచారంలో ఉండగా….. బ్రహ్మ వ్యాసుని కోరికను గుర్తించి , అతని ఎదుట ప్రత్యక్షమయ్యి “వ్యాసా ! నీ కావ్యరచనకి, తగినవాడైన గణపతిని స్మరించు.” అని తెలిపి అద్రుశ్యమయ్యాడు. అంతట వ్యాసుడు గణేశుని ప్రార్థించగా…. గణేశుడు ప్రత్యక్షమయ్యాడు. నేను మనసులోనే రచించిన భారతాన్ని నేను చెబుతూ ఉంటే నీవు వ్రాయాలి అని కోరాడు వ్యాసుడు. సరే అని ఒక షరతు పెట్టాడు గణేశుడు. నేను వ్రాసే ఘంటం ఆగకుండా నీవు చెప్పాలి. నా ఘంటం ఆగిన యెడల నేను వ్రాయను అని అన్నాడు. దానికి వ్యాసుడు అంగీకరించి నేను చెప్పిన శ్లోకాలను అర్థం చేసుకొని నీవు వ్రాయాలి అని అన్నాడు…. ఈ నియమానికి అంగీకరించాడు గణపతి. ఇలా వేద ధర్మాలను ప్రతిపాదిస్తూ వేదవ్యాసుడు చెబుతూ ఉంటే , నాలుగు వేదాల సారమైన పంచమవేదం అని మనం చెప్పుకొనే మహాభారతం అవతరించింది.
ఈయన వల్లే కురువంశం అభివృద్ధి చెందింది. తల్లి కోరికపై దృతరాష్టుని , అంబాలికకు పాండు రాజుని , అంబిక దాసికి విదురుని ప్రసాదించినాడు. పాండవాగ్రజుడైన ధర్మరాజుకి ప్రతిస్మృతిని ఉపదేశించింది వ్యాసుడే ! దానిని ధర్మరాజు ద్వారా అర్జునుడు ఉపదేశం పొంది దేవతలను మెప్పించి అస్త్రశస్త్రాలుపొందాడు. కురుపాండవ చరిత్ర ఖ్యాతి పొందేట్లుగా మూడు సంశ్ర…మించి జయం అనే పేరు మీద వారి గాథలు గ్రంథస్థం చేసాడు వ్యాసుడు. ఆ జయమే మహా భారతమైంది.
కలియుగంలో మానవులు అల్పబుద్ధులు , అల్పాయువులై ఉంటారు. అందుకే మన ప్రాచీనులు పరమ ప్రామాణికంగా…. అంగీకరించిన వేదాన్ని అధ్యయనం చేయలేరు. అర్థం చేసుకోలేరు.
వేదమంటే అసలు ఎవరూ తయారుచేసింది కాదు. స్వయం భగవానుని ముఖతః వేలువడినదే వేదము. అందుకే అతనిని “వేదపురుషుడు” అని అంటారు. వేదములో విషయాలు ఉన్నాయి. వేదములో లేనివి— మరెక్కడా లేవు. ఇవన్నీ కలగాపులగంగా ఏక రూపంలో ఉంటాయి. దీనిని కలియుగంలో ఉన్న జనులు అర్థం చేసుకోలేరని, భగవానుడే ప్రతీ ద్వాపరయుగంలోనీ వ్యాసుడుగా అవతరించి , వేదాలను విభజిస్తాడు మందబుద్దుల కోసం వేదాధ్యాయానికి , అవకాశం లేనివారికోసం వేదంలోని విశేషాలను , ఇతిహాస పురాణాల ద్వారా లోకానికి అందించాడు.
ప్రాచీన గాథలు , గత కల్పాలలో జరిగిన చరిత్రలు , సృష్టికి పూర్వం అనేక సృష్టులలో జరిగిన విశ్వం యొక్క పూర్వ వృత్తాంతం మన పురాణాల్లో నిగూఢంగా నిక్షిప్తమయినాయి. ఎవరు వాటిని అర్ధం చేసుకోవాలన్నా , ఇతరులకి చెప్పాలన్నా అంతరార్ధాలతో బోధించాలన్న వ్యాస మహర్షి అనుగ్రహం అత్యవసరం. వ్యాస మహర్షి అంశ లేనిదే ఎవరూ పురాణ గాథల్ని చెప్పలేదు , చదవలేదు. అందుకే వ్యాసపూర్ణిమ నాడు వ్యాస పూజను తప్పక చేయాలంటారు. ఈ పర్వము యతులకు అతి ముఖ్యం ! వ్యాస పూర్ణిమ పర్వాన్ని ఆదిలో శంకరాచార్యులు ఏర్పాటు చేశారని చెబుతారు.
పూజా విధానం (వ్యాస పూజ , గురు పూజా విధానం)
కొత్త అంగవస్త్రం మీద (భూమి మీద పరచి) బియ్యం పోస్తారు. ఆ బియ్యంపైన నిమ్మ కాయలు ఉంచు తారు. శంకరులు , అతని నలుగురు శిష్యులు వచ్చి దానిని అందుకుంటారని నమ్మకం. పూజ అయ్యాక ఆ బియ్యం తీసుకెళ్ళి పిడికిడు చొప్పున తమ ఇళ్లల్లో బియ్యంలో కలుపు తారుట. బియ్యం , కొత్త వస్త్రం లక్ష్మీ చిహ్నం. నిమ్మపళ్ళు కార్యసిద్ధికి సూచన. బియ్యం , నిమ్మపళ్ళు లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. దక్షిణాదిన కుంభ కోణంలో , శృంగేరీలో శంకర మఠాలలో వ్యాసపూర్ణిమ ఎంతో వైభవంగా జరుపుతారు.
ఎంతో మంది ఋషులున్నా వ్యాసుని పేరిటే ఎందుకు జరుగుతుంది అంటే , ఈ పూజలో ప్రత్యేక పూజలు పొందే ఆది శంకరులు వ్యాసుని అవతారమని అంటారు. సన్యాసులంతా ఆది శంకరుని తమ గురువుగా ఎంచుకుంటారు. అయితే ఈ రోజున సన్యాసులంతా వ్యాసుని రూపంలో వున్న తమ గురువుని కొలుస్తున్నారన్న మాట! వైష్ణవ పురాణం దానం చేస్తే ఆషాఢ పూర్ణిమనాడు విష్ణులోకం పొందుతారుట. వ్యాసుడు సకల కళా నిధి , సకల శాస్త్రవేత్త , శస్త్ర చికిత్సవేది , మేధానిధి , వైద్యవరుడు , ఆత్మవిద్యానిధి , వైద్య విద్యానిధి. ఈ రోజున అష్టాదశ పురాణ నిర్మాత అయిన వ్యాసుని తప్పక పూజించాలి.
వ్యాస పూర్ణిమ నాడు ఈ శ్లోకాన్ని పఠించాలి.
శో: శంకరం శంకరాచార్యం గోవిందం బాదరాయణం
సూత్ర భాష్యవృతా వందే భగవంతౌ పునః పునః
అని పఠిస్తే బ్రహ్మత్వసిద్ధి కలుగును!
గురు సందేశము :-
వేదవ్యాసుడు తన రెండు చేతులనూ పైకి ఎత్తి లోకమంతటికీ నమస్కరిస్తూ చెప్పిన మాటల్లో విశిష్టమైనది ఏమిటంటే- ‘ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారో మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించవద్దు.’ పరమ ధర్మపథాలన్నింటిలోకీ పరాయణమైన ఈ ఒకే ఒక్క విషయాన్ని త్రికరణశుద్ధిగా పాటించినట్లయితే మన సమాజం కచ్చితంగా శాంతిధామమవుతుంది.
సర్వభూతముల యందు దయకలిగియుండుట , సత్యమార్గములో నడుచుట , శాంతగుణాన్ని కలిగియుండుట ఈ మూడు గుణాలని అందరూ అలవరచుకోవాలి అని వ్యాసులవారు తెలియచేసారు.
మనందరికీ దేవరుణము , ఋషిరుణము , పితృఋణము అని మూడు ఋణాలు ఉంటాయి. వీటితోపాటు వేదవ్యాసుడు మనుష్య ఋణము కూడా ఉంటుందని తెలియచెప్పాడు. సర్వప్రాణుల యందు దయతో ఉండటం , ఇతరులకు ఉపకారం చేయటం ద్వారా మనుష్య ఋణం తీర్చుకోవచ్చును అని చెప్పాడు.
ఇంతటి ఆది గురువుని పూజించుట మన కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని తరవాత తరాలకి అందించుట మన ధర్మం.
మన పిల్లలకు ఇతిహాస , పురాణాల పట్ల , ప్రాచీన సంస్కృతీసాంప్రదాయాల పట్ల , అభిరుచి కలిగించుట మన కర్తవ్యం. వీటిలో కొన్నయినా సాధించగలిగితే వ్యాసులవారి ఋణం కొంతయినా మనం తీర్చుకున్నట్లు అవుతుంది. ఆ వ్యాసభగవానుని కృపకు మనము పాత్రులము కాగలము అని ఆశిద్దాం. అందుకే గురుపూజను చేసుకుందాం. సాటి గురువులో భగవంతుని దర్శిద్దాం.
గురు పౌర్ణమి & వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు…